ఆగస్టులో పింఛను తీసుకోకుండా రెండు నెలలదీ సెప్టెంబరులో తీసుకుందామనుకున్న వారికి ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వలేదు. సెప్టెంబరులో ఒక నెల పింఛనే లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలనే ఆదేశాలూ పింఛను పంపిణీకి రెండు రోజుల ముందు ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రభావం లక్ష మంది లబ్ధిదారులపై పడనుంది. వ్యవసాయ పనులకు వలస వెళ్లే వారు... నగరాల్లో పిల్లల వద్ద ఉంటున్న పండుటాకులు, కరోనా వేళ ప్రయాణాలు వద్దని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారూ ఇబ్బందిపడే అవకాశం ఉంది. గతేడాది లాక్‌డౌన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్న లక్షా 87 వేల మందికి 6 నెలల మొదలు నెల పింఛను బకాయిలనూ ఒకేసారి అందించారు.
కరోనా ముప్పు తొలగక ముందే ఇప్పుడు ఇలా నిర్ణయించడం లబ్ధిదారులను కలవరపరుస్తోంది. తమ పింఛను ఎక్కడ అందకుండా పోతుందోనని... అర్హులు ఆవేదన చెందుతున్నారు. నెలకోసారి తనిఖీలంటూ పింఛను లబ్ధిదారుల సంఖ్యలో ప్రభుత్వం కోతపెడుతోంది. జూన్‌లో బియ్యం, ఆధార్ కార్డుల్లోని మార్పుల ఆధారంగా ఒంటరి, వితంతు పింఛన్లను తనిఖీ చేసింది. జులైలో వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారణ మేరకు ఇచ్చే డయాలసిస్, ఇతర పింఛన్లను పరిశీలించింది. దివ్యాంగులవీ పునఃపరిశీలించింది. చనిపోయిన వారి పేరు మీద పింఛను పొందకుండా ఈకేవైసీని నమోదు చేయించింది.