ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సమానాభివృద్ధి కోసమే 3 రాజధానులు : గవర్నర్​

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి, వనరుల సమాన పంపిణీయే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకుందని గవర్నరు బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని.. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా చెప్పారు.

governer bhiswabhushan
సమానాభివృద్ధి కోసమే 3 రాజధానులు : గవర్నర్​

By

Published : Jan 27, 2020, 7:31 AM IST

'కార్యనిర్వాహక రాజధాని విశాఖే'

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి, వనరుల సమాన పంపిణీయే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం తీసుకుందని గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుందని తెలిపారు. ఒకే ప్రాంతంలో వనరులన్నింటినీ వినియోగించడం, అంతా కేంద్రీకృతం చేయడమనేది ప్రజాస్వామ్య మౌలిక లక్షణానికి విరుద్ధమని చెప్పారు.

విజయవాడలోని ఇందిరాగాంధీ నగర పాలక మైదానంలో 71వ గణతంత్ర దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. గవర్నరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం గవర్నరు ప్రసంగిస్తూ.. తమ ప్రభుత్వం నవరత్నాల పేరిట పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థతో పరిపాలన వికేంద్రీకరణలో అతి పెద్ద ముందడుగు వేశామని.. 500 రకాల ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటకే చేరవేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఈ వ్యవస్థ ద్వారా 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.

‘గోదావరి నీటిని రాయలసీమకు తీసుకెళ్లేందుకు రూ.69వేల కోట్లతో ప్రాజెక్టును చేపడుతున్నాం. బొల్లాపల్లి రిజర్వాయరు, బనకచర్ల రెగ్యులేటరు ద్వారా ఈ నీటిని తరలిస్తాం. కాలువల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అదనపు కాలువలను నిర్మిస్తాం. కృష్ణా వరదనీరు 50 రోజులపాటు పారేందుకు వీలవుతుంది. ఆ నీటితో రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లనూ నింపుతాం. 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు అందిస్తాం. గాలేరు-నగరి రెండోదశను పూర్తిచేసి కడప, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్ష ఎకరాలకు సాగునీరు, 5 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందిస్తాం' అన్నారు.

రూ.15,648 కోట్ల పెట్టుబడులు

'అత్యధిక ఆర్థిక వృద్ధిని కొనసాగించాల్సిన అవసరాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. సరికొత్త విధానాలతో సుస్థిరాభివృద్ధి సాధిస్తాం. రాష్ట్రంలో రూ.15,648 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత కంపెనీలు ముందుకొచ్చాయి. తద్వారా 25,967 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి' అని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.

46 లక్షల మందికి రైతు భరోసా

'వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద 46 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ.13,500 చొప్పున ఇస్తున్నాం. కౌలు రైతులకూ ఈ సాయాన్ని అందజేస్తున్నాం. గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 2020 జూన్‌ నాటికి 11,158 కేంద్రాలను నెలకొల్పుతాం. పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15,000 చొప్పున ఇస్తున్నాం. 43 లక్షల మంది తల్లులకు రూ.6,456 కోట్లు ఇచ్చాం. 2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నాం. 25 లక్షల మంది పేదలకు ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం. సంవత్సరానికి 6 లక్షల ఇళ్ల చొప్పున నిర్మిస్తాం. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా దుకాణాల సంఖ్యను, వాటి పని వేళలను కుదించాం. విక్రయాలు తగ్గాయి. మహిళలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా దిశ చట్టం తీసుకొచ్చాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం.’ అని గవర్నరు తన ప్రసంగంలో వివరించారు' అంటూ.. ప్రభుత్వం కార్యక్రమాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details