Green India Challenge: అక్షరాలను పూయించే కవులు, రచయితలు అడవుల పెంపకంలో భాగంగా మొక్కలు నాటే ఉద్యమంలో పాలుపంచుకోవాలని కవి గోరటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వనజీవి రామయ్య విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన గోరటి, జూలూరి.. రవీంద్రభారతి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రకృతిని చూసి పరవసించి కవితలు, పాటలు, నవలలు, కథలయ్యే రచయితలందరూ పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని వారు విజ్ఞప్తి చేశారు.
సృజనశీలులైన సాహితీమూర్తుల మూలాలన్నీ పర్యావరణంలోని ప్రతి మొక్కలో, ఆకులో, పిందెలో, మొలకెత్తే విత్తనంలో ఉంటాయని గోరటి గుర్తుచేశారు. మానవజాతిని, భూమండలాన్ని రక్షించే ప్రకృతిమాత రుణం తీర్చుకునే బిడ్డలుగా ప్రతి మనిషి ఒక మొక్కను నాటాలని.. వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని కోరారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహోద్యమంగా మరింత ముందుకు తీసుకుపోవటంలో సాహిత్య సాంస్కృతిక కళారంగాలు కదలిరావాలన్నారు.