ఆషాడమాసంలో బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో... హైదరాబాద్‌లో ఉత్సవాలు మొదలుకానున్నాయి. గోల్కొండ బోనాలు ముగిసిన మరుసటి వారం లష్కర్ బోనాలు జరగనున్నాయి. కరోనా కారణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారికి బోనం సమర్పించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
బోనాన్ని మహిళలే తయారు చేస్తారు..
కుటుంబ బాంధవ్యాలతో పెనవేసుకుపోయిన బంధం బోనం. స్త్రీ.. శక్తికి ప్రతిరూపం. సంప్రదాయానికి చిహ్నం. అందుకే ఈ బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. గ్రామ దేవతలకు పసుపు కుంకుమలు, చీర సారెలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు. తమ కుటుంబానికి, గ్రామానికి ఏ ఆపద రాకుండా రక్షించమని ప్రార్థిస్తారు.
ఇదే ఆనవాయితీ..
రాష్ట్రంలో బోనాలు తొలిసారిగా గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే ప్రారంభం కావడం ఆనవాయితీ. నేడు ప్రారంభమయ్యే బోనాల సందడి... వచ్చే నెల 8 వరకు కొనసాగుతుంది. ప్రతి గురువారం, ఆదివారం బోనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
'తెలంగాణలో తొలుత గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే బోనాలు జరుగుతాయి. ఇక్కడ తొమ్మిది పూజలు జరుగుతాయి. ఐదురోజు చంఢీయాగం, ఏడోరోజు అమ్మవారి సేవ, తొమ్మిదో రోజు కుంభ హారతి కార్యక్రమం జరుగుతుంది'.
- సర్వేశ్‌చారి, ఆలయ పూజారి
'అక్కన్న మాదన్న ఉన్నప్పుడి నుంచే బోనాలు వైభవంగా నిర్వహించేవారు. అన్ని కులాలవారితో కలిసి అమ్మవారి వద్దకు బోనాలు తీసుకొస్తాం'.