ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Golconda bonalu 2022: ఆషాడం సందడి.. బోనమెత్తిన గోల్కొండ

By

Published : Jun 30, 2022, 3:23 PM IST

Updated : Jun 30, 2022, 3:47 PM IST

Golconda bonalu 2022 : భాగ్యనగర వాసుల ప్రియమైన పండుగ బోనాల ఉత్సవం రానే వచ్చింది. బోనాల మహోత్సవానికి గోల్కొండ వేదికగా తెరలేచింది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట గోల్కొండ నుంచి ప్రారంభమయ్యాయి. తొలి బోనాన్ని జగదాంబిక అమ్మవారు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Golconda bonalu 2022
బోనాల ఉత్సవం

Dolconda bonalu 2022 : భాగ్యనగర వైభవం.. తెలంగాణ ప్రత్యేకమైన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక కోట గోల్కొండ నుంచి తొలిబోనం బయల్దేరింది. హైదరాబాద్‌లో నెలరోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రెండేళ్లుగా కరోనాతో సందడి కాస్త తగ్గినా.. ఈయేడు ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

కోలాహలంగా భాగ్యనగరం..గోల్కొండ బోనాల తర్వాత లష్కర్, లాల్ దర్వాజ, ధూల్‌పేట, బల్కంపేట, పాతబస్తీ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాల్లో బోనాలు జరుగుతాయి. గోల్కొండ కోట నుంచి ఆరంభమైన బోనాలు.. చివరకు లాల్‌దర్వాజ అమ్మవారి వద్ద పూర్తవుతాయి. బోనాల మాసమంతా భాగ్యనగరం సందడిగా మారుతుంది. పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బోనాల వైభవం.. శివసత్తుల పూనకాలు.. అందంగా ముస్తాబైన భక్తులు.. పోతురాజుల విన్యాసాలతో గోల్కొండ కోట కోలాహలంగా మారింది.

బోనాల ఉత్సవం

గోల్కొండ బోనాలకు రూ.15 లక్షలు..గోల్కొండ బోనాలకు రూ.15 లక్షల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బోనాల పండుగ జరుపుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

సంతోషంగా ఉంది..గోల్కొండ బోనాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను వైభవంగా నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బోనాల పండుగకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించారని వెల్లడించారు. భక్తులంతా జాగ్రత్తగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.

సంతోషం.. సంబురం.. బోనాల పండుగ అత్యంత సంతోషకరమైన పండుగ అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొదటి బోనం గోల్కొండ జగదాంబికా అమ్మవారికి సమర్పించామని తెలిపారు. వందల ఏళ్ల నుంచి బోనాల జాతర జరుగుతోందని వెల్లడించారు. నగరంలోని ప్రతి ఆలయానికి ఆర్థిక సాయం అందించిన ఘనత కేసీఆర్‌దని కొనియాడారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల ఉత్సవం ముందుకు సాగుతోందని వివరించారు.

"జులై 17, 18న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. 24, 25న లాల్ దర్వాజ బోనాలు నిర్వహిస్తాం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో వైభవోపేతంగా బోనాల ఉత్సవం జరుపుకుంటున్నాం. కులమతాలకతీతంగా బోనాలు నిర్వహిస్తున్నాం. 10వ తేదీన బోనాలు.. బక్రీద్ వేడుకలు రెండూ జరగనున్నాయి. అందరం కలిసి ఆనందంగా ఈ పండుగలను జరుపుకుందాం."- తలసాని శ్రీనివాస్ యాదవ్

Last Updated : Jun 30, 2022, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details