గెజిట్ నోటిఫికేషన్‌పై తదుపరి కార్యాచరణ గురించి చర్చించేందుకు కృష్ణా, గోదా వరి బోర్డులు సమన్వయ కమిటీల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. అయినా తెలంగాణ నుంచి సమన్వయ కమిటీ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు. బోర్డు కార్యాలయాలతో పాటు తెలంగాణ నీటిపారుదల, పరిపాలనా విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయాలు కూడా జలసౌధ భవనంలోనే ఉన్నప్పటికీ తెలంగాణ నుంచి ఎవరూ సమావేశంలో పాల్గొనలేదు. చివరికి రెండు బోర్డులూ..ఆంధ్రప్రదేశ్ అధికారులతోనే చర్చించాయి. గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై మొదట బోర్డులు ప్రజంటేషన్ ఇచ్చాయి. నోటిఫికేషన్‌లోని అంశాలు అమలులోకి తేవడానికి ఏం చేయాలి? ఏ తేదీలోగా రాష్ట్రాలు ఏం చేయాలనే దానిపై బోర్డు కార్యదర్శులు వివరించారు. ఆగస్టు 15లోగా ప్రాజెక్టుల వారీగా సిబ్బంది వివరాలు అందజేయాలని, ఒక్కో బోర్డుకు 200 కోట్ల చొప్పున డబ్బు డిపాజిట్ చేయడం గురించి నిర్ణయం చెప్పాలని బోర్డు అధికారులు కోరారు.
గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు నిర్ణీత గడువులోగా సిబ్బంది, ప్రాజెక్టుల వివరాలు, నిధులు, కేంద్ర బలగాల నియామకం తదితర అంశాలపై వివరాలు అందజేయాలని.. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు కోరాయి. అయితే నోటిఫికేషన్లోని రెండో షెడ్యూలు ప్రాజెక్టులపై కొన్ని అభ్యంతరాలున్నాయని, ఇందుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాస్తామని ఏపీ సమాధానమిచ్చింది. ఏయే అంశాల్లో ప్రాజెక్టుల్లో మార్పులు చేయాలని కోరుకుంటున్నారని బోర్డు అధికారులు ప్రశ్నించగా, వివరాలు ప్రస్తుతం చెప్పలేమని, ఉన్నతాధికారులు, న్యాయ బృందం, ముఖ్యమంత్రితో చర్చించాకే లేఖ రాస్తామని తెలిపారు.