ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోమారు వాయిదా - జీఆర్‌ఎంబీ భేటీ

GRMB MEET: హైదరాబాద్‌లో ఇవాళ జరగాల్సిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరగాల్సిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఇంజినీర్లు హాజరయ్యారు. కానీ ఏపీకి చెందిన ఒక్క అధికారి కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఏపీ అధికారుల గైర్హాజరుతో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ కూడా భేటీలో పాల్గొనలేదు.

GRMB MEET
గోదావరి నదీ యాజమాన్య బోర్డు

By

Published : Apr 22, 2022, 8:16 PM IST

MB Meeting Postponed : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోమారు వాయిదా పడింది. గత నెల 11వ తేదీన వాయిదా పడిన జీఆర్ఎంబీ 13వ సమావేశాన్ని ఇవాళ ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధ వేదికగా సమావేశం జరగాల్సి ఉంది. నిర్ణీత సమయానికి ఛైర్మన్ ఎంపీసింగ్ సహా ఇతర సభ్యులు, తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, ఇంజినీర్లు సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సభ్యులు గైర్హాజరయ్యారు. తమకు వేరే పనులు ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని గురువారం రాత్రి ఏపీ అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఏపీ సభ్యులు రాకపోవడంతో తాను కూడా హాజరు కావడం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమాచారం ఇచ్చారు. సరిపడా కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు బోర్డు ఛైర్మన్ ఎంపీసింగ్ ప్రకటించారు.

GRMB Meeting : వాయిదా వేసి 42 రోజుల సమయం తర్వాత నిర్వహిస్తున్న సమావేశానికి కూడా ఏపీ అధికారులు హాజరు కాకపోవడం సబబు కాదన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్... వీలైనంత త్వరగా మళ్లీ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ఛైర్మన్‌ను కోరారు. తెలంగాణకు చెందిన మూడు ప్రాజెక్టులు చనాకా - కొరాటా, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం డీపీఆర్‌లకు ఆమోదం తెలపడంతో పాటు బోర్డు బడ్జెట్ అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తదుపరి సమావేశం ఎప్పుడు నిర్వహించేది వీలైనంత త్వరలోనే ప్రకటిస్తామని ఛైర్మన్ ఎంపీసింగ్ తెలిపారు.

GRMB Meeting : గోదావరి బోర్డు భేటీ వాయిదాపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌ అన్నారు. 3 తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లకు బోర్డు ఆమోదం తెలపాలని వెల్లడించారు. ఏపీ సభ్యులు రాకపోవడంతో అనుమతులకు ఆలస్యమవుతోందని వాపోయారు. గత సమావేశానికి కూడా ఏపీ సభ్యులు రాలేదని గుర్తుచేశారు. సీతారామ, తుపాకులగూడెంకు హైడ్రలాజికల్ అనుమతి వచ్చిందన్న రజత్ కుమార్.. అన్ని ప్రాజెక్టులకు జులైలోగా అనుమతి వస్తుందని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలపై కేంద్రం ఇంకా ట్రైబ్యునల్‌కు నివేదించడం లేదని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details