ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GRMB: బోర్డుల పరిధిలో కార్యాచరణకు సై... ఆగస్టు 3న కమిటీ భేటీ

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ

By

Published : Jul 30, 2021, 8:51 PM IST

Updated : Jul 31, 2021, 6:27 AM IST

20:49 July 30

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ

కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులను తమ ఆధీనంలోకి తెచ్చుకొనే ప్రక్రియకు బోర్డులు శ్రీకారం చుట్టాయి. నోటిఫికేషన్‌ అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణకు నడుం బిగించాయి. బోర్డు పరిధిలో ఉండే ప్రాజెక్టుల సిబ్బంది, కార్యాలయాలు, వాహనాలు, పరికరాలు మొదలైనవన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం, ప్రాజెక్టుల వద్ద అవసరాన్ని బట్టి కేంద్ర పోలీసు బలగాలను నియమించడం, సీడ్‌ మనీ కింద ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల వంతున చెల్లించడం తదితర అంశాలన్నింటిపై రెండు రాష్ట్రాలతోనూ బోర్డులు చర్చించనున్నాయి.

   గతంలో బోర్డు కమిటీల్లో ఉన్నవారినే కాక జెన్‌కో, ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖలోని పరిపాలనా విభాగం అధికారులను కూడా కలిపి ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటుచేశాయి. అనుభవమున్న ఓ చీఫ్‌ ఇంజినీర్‌ను, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ను సమన్వయం కోసం పంపాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులను కోరింది. గోదావరి బోర్డు ఒకడుగు ముందుకేసి ఆగస్టు 3న సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో బోర్డులోని అధికారులతో పాటు కేంద్ర జల్‌శక్తి అధికారి, రెండు రాష్ట్రాల నీటిపారుదల, పరిపాలనా విభాగాల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో సీఎండీ, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీలను ఆహ్వానించారు.

బోర్డు ఆధీనంలో ఉండే ప్రాజెక్టులపై..  

కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రాజెక్టులను మూడు విభాగాలుగా విభజించారు. బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, బోర్డు ఆధీనంలో ఉండేవి, రాష్ట్రాల నిర్వహణలో ఉండి కేవలం పర్యవేక్షణ మాత్రమే బోర్డుకు ఉండేవి. ఇందులో బోర్డు ఆధీనంలో ఉండే ప్రాజెక్టుల గురించి ఆగస్టు మూడున జరిగే భేటీలో గోదావరి బోర్డు చర్చించనుంది. శ్రీరామసాగర్‌, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజి, పంపుహౌస్‌, తుపాకులగూడెం, దేవాదుల, సీతారామ, పోలవరం, ధవళేశ్వరం, తాడిపూడి, పుష్కరం, చింతలపూడి, సీలేరు జలవిద్యుత్తు ప్రాజెక్టు మొదలైనవన్నీ గోదావరి బోర్డు పరిధిలో ఉన్నాయి. వాటి వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను నియమించడం, ప్రాజెక్టులు, నిర్వహణకు సంబంధించి కోర్టుల్లో కేసులు వస్తే అందుకయ్యే వ్యయాన్ని రాష్ట్రాలే భరించడం, ప్రాజెక్టుల్లో మంజూరుచేసిన సిబ్బంది, పనిచేస్తున్న సిబ్బంది, యంత్రాలు, ఆఫీసు కార్యాలయాలు, ఫర్నిచర్‌, వాహనాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, రికార్డులు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు లేకుండా నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు ఆరునెలల్లో అనుమతులు పొందడం, అనుమతులు రాని ప్రాజెక్టులను నిలిపివేయడం ఇలా అన్ని అంశాలను మూడో తేదీ సమావేశానికి అజెండాగా గోదావరి బోర్డు నిర్ణయించింది. కృష్ణాబోర్డు సైతం త్వరలోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.

ఇదీ చదవండి:

Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే..

Last Updated : Jul 31, 2021, 6:27 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details