ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న గోదావరి

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం 48.5 అడుగులకు చేరి.. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోన్న గోదావరి
రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోన్న గోదావరి

By

Published : Aug 16, 2020, 1:37 PM IST

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల వరద నీరు పోటెత్తింది. 2 రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. నేడు ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.5 అడుగులకు చేరి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

మరోవైపు గోదావరి నీటి మట్టం పెరగడం వల్ల భద్రాచలం చుట్టు పక్కల ఉన్న చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద వరద ఉద్ధృతి వేగంగా పెరుగుతోంది. సీతమ్మ వాగు వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. లక్ష్మీపురం గ్రామం వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న విలీన మండలాలైన కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి సైతం వరద నీరు చేరి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

భద్రాచలంలోని స్నానఘట్టాల ప్రాంతం, కల్యాణ కట్ట ప్రాంతం వరద నీటిలో మునిగిపోయాయి. రామయ్య సన్నిధి వద్ద గల అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది.

ఇదీచూడండి: ఉగ్రరూపం దాల్చిన మున్నేరు... కొనసాగుతున్న వరద

ABOUT THE AUTHOR

...view details