Godavari flood equipment tenders: గోదావరి వరద ముంచెత్తుతున్నా ఇప్పటికీ జలవనరులశాఖ అందుకు సన్నద్ధంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. జలవనరుల శాఖలో ఇటీవల జరిగిన బదిలీలు తీవ్ర విమర్శల పాలయ్యాయి. ప్రలోభాలతో ఇంజినీర్లను బదిలీ చేశారనే ఆరోపణలు రేగాయి. ప్రస్తుతం గోదావరి వరదను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఇంజినీర్లు, అధికారులు కూడా లేరు. వరద వచ్చే సమయానికి సిద్ధం చేసుకోవాల్సిన సామగ్రినీ అధికారులు సమకూర్చలేదు.
ఇప్పటికే గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి వరద ప్రవహిస్తోంది. ఇసుక బస్తాలు, సర్వే బద్దల్లాంటి సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పటివరకు ఇందుకోసం టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా చేపట్టలేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గోదావరి హెడ్ వర్క్సుకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఉండాలి. ఆయననే వరద కన్జర్వేటర్‌గా పిలుస్తారు. బ్యారేజి నిర్వహణ బాధ్యత ఆయనదే. తాజా బదిలీల్లో ఆయనకు స్థానచలనం కలిగింది. ఆయన స్థానంలో వేరే ఈఈని నియమించలేదు. ప్రస్తుతం అక్కడ డీఈఈ అదనపు బాధ్యతలతో ఆ విధులు నిర్వహిస్తున్నారు.
ఇటీవలి వరకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి ఎస్‌ఈగా ఉన్న అధికారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేశారు. గోదావరి బ్యారేజిలో డ్రెడ్జింగ్ టెండర్ల విషయంలో పైనుంచి సూచించిన గుత్తేదారుకు పనులు అప్పచెప్పాలనే ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ ఎస్‌ఈ వ్యక్తిగత సెలవులో వెళ్లిపోయారనే విమర్శలున్నాయి. తర్వాత అక్కడ రెగ్యులర్ ఎస్‌ఈని నియమించలేదు. సెలవుపై వెళ్లిన ఎస్‌ఈని వేరే జిల్లాలో అప్రాధాన్య పోస్టులో నియమించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈగా ఉన్న నరసింహమూర్తి ధవళేశ్వరం బ్యారేజికి ఎస్‌ఈగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.