తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రసాదం తయారీలో సిబ్బంది అజాగ్రత్త.. భక్తుల ప్రాణాల మీదకు వస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనే దీనికి నిదర్శనం.
Yadadri Prasadam: యాదాద్రి ప్రసాదంలో గాజుముక్క - Glass pieces in yadadri prasad
తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో స్వామి ప్రసాదం తయారీలో సిబ్బంది నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు వస్తోందని కొందరు వాపోతున్నారు. ఓ వ్యక్తికి పులిహోర ప్రసాదంలో గాజుసీస ముక్క రావడం భక్తుల్లో కలవరం కలిగిస్తోంది. చిన్నపిల్లలు చూడకుండా ప్రసాదం తింటే వారి పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్‌కు చెందిన రఘు ఆదివారం రోజున కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి క్షేత్ర సందర్శనకు వెళ్లారు. పాతగుట్ట ఆలయంలో స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కౌంటర్‌లో ప్రసాదం కొనుగోలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కూర్చొని.. కుటుంబంతో సహా ప్రసాదం తింటుండగా.. పులిహోరలో గాజుముక్క కనిపించింది. వెంటనే అప్రమత్తమై తన పిల్లల వద్ద ఉన్న ప్రసాదాన్ని రఘు తీసుకున్నారు.
ప్రసాదంలో సీసం ముక్కలు ఉన్నాయని.. తినొద్దని వారించారు. ప్రసాదాల తయారీలో అజాగ్రత్త వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రఘు అన్నారు. తాను చూడడం వల్ల ప్రమాదం తప్పిందని.. పిల్లలు తినే ప్రసాదంలో ఇలా జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆలయ ఏఈవో శ్రవణకుమార్ తెలిపారు.