ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆహార భద్రతకు నగదు ముప్పు!

రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యానికి బదులు నగదు తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకమే అయినా ఈ పథకాన్ని రాష్ట్రమంతా విస్తరించి.. ఏ కారణంతోనైనా కార్డుదారులు అంగీకరిస్తే.. లక్షల కుటుంబాల ఆహార భద్రత ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన ప్రభుత్వం.. నగదు బదిలీ ఆలోచన చేయడమేంటని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు

ration
ration

By

Published : Apr 20, 2022, 4:22 AM IST

రేషన్‌ కింద ఇచ్చే బియ్యాన్ని అమ్ముకోడానికి కారణం.. అవి తినేందుకు అనుకూలంగా లేకపోవడమే. ఇచ్చేది నాణ్యమైన సన్న బియ్యమే అయితే.. వాటిని కిలో రూ.10-12 చొప్పున అమ్ముకుని మార్కెట్లో రూ.40 చొప్పున ఎందుకు కొంటారు? సార్టెక్స్‌ పేరుతో నూకశాతాన్ని తగ్గించినంత మాత్రాన అవి నాణ్యమైన సన్నబియ్యం కావనే అంశాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది.

మార్కెట్లో సన్నబియ్యం (గ్రేడ్‌ 1-ఫైన్‌) ధర కిలోకు రూ.42 చొప్పున ఉంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కిలోకు రూ.38.24 చొప్పున రాయితీ భరించి కిలో బియ్యాన్ని రూపాయి చొప్పున కార్డుదారులకు అందిస్తోంది. మార్కెట్లో సన్న బియ్యానికీ.. ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యానికి కిలోకు రూ.3 మాత్రమే తేడా కనిపిస్తోంది. అలాంటప్పుడు ప్రభుత్వమే నాణ్యమైన సన్నబియ్యం ఇస్తే.. వాటిని అమ్ముకునే అవసరమే ఉండదు కదా?

చౌక బియ్యానికి నగదు బదిలీ అమలుచేస్తే.. పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకమే అయినా ఈ పథకాన్ని రాష్ట్రమంతా విస్తరించి.. ఏ కారణంతోనైనా కార్డుదారులు అంగీకరిస్తే.. లక్షల కుటుంబాల ఆహార భద్రత ప్రశ్నార్థకం అవుతుంది.. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకూడదని, రీసైక్లింగ్‌కు అవకాశం ఇవ్వకూడదనే నగదు బదిలీ అమలు చేస్తామని, అదీ వినియోగదారులు కోరుకుంటేనే అమలుచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే దీనివల్ల బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగే ప్రమాదమూ ఉంది. ఒక నెల చౌక బియ్యం అందకపోతే పూట గడవని కుటుంబాలు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. నగదు బదిలీకి అంగీకరిస్తే.. ఈ కుటుంబాలపై ప్రతి నెలా ఆర్థిక భారం పెరుగుతుంది. పేదల బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన ప్రభుత్వం.. నగదు బదిలీ ఆలోచన చేయడమేంటని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కార్డుదారుల నుంచి కొనే బియ్యాన్ని భారీగా విదేశాలకు తరలిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. కొంత రీసైక్లింగ్‌ ద్వారా మళ్లీ పౌరసరఫరాల శాఖకే సరఫరా చేస్తున్నారు.

*ప్రతి కుటుంబానికీ బియ్యం అవసరమే. అందులో 1.45 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం చౌకధరల దుకాణాలు, మొబైల్‌ వాహనాల ద్వారా నెలకు సగటున 2.34 లక్షల టన్నుల బియ్యం అందిస్తోంది. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని గతంలో చెప్పిన నేతలు... తీరా వచ్చేసరికి గతంలో ఇచ్చే బియ్యంలోనే నూక శాతం తగ్గించి పంపిణీ చేస్తున్నారు. అయితే ప్రజలు సన్నబియ్యాన్ని కోరుకుంటున్నారు. అవే ఇస్తే అమ్ముకునేవారి శాతం తగ్గిపోతుంది.

మార్కెట్లో బియ్యం ధరలు పెరిగితే

ప్రజాపంపిణీ ద్వారా.. ప్రభుత్వం ఏడాదికి 28 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. అందుకే బహిరంగ మార్కెట్లో ధరలు పెరగడం లేదు. నగదు బదిలీ అమలు చేస్తే ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం తగ్గిపోతుంది. ఇదే అదనుగా వ్యాపారులు బియ్యం ధరలు పెంచే అవకాశం ఉంది. గతంలో నగదు బదిలీ అమలుచేసిన రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. మన రాష్ట్రంలోనూ అదే జరిగితే.. కార్డుదారులకు బియ్యం మరింత భారం అవుతాయి.

పేదల ఆహార భద్రతకు విఘాతం

నగదు బదిలీ ద్వారా పేదల ఆహారభద్రత ప్రశ్నార్థకం కానుంది. ఏ కుటుంబానికీ ఆహారానికి లోటు ఉండకూడదనే.. ప్రభుత్వం కుటుంబ సభ్యుడికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తోంది. శ్రీకాకుళంతో పాటు మరికొన్ని జిల్లాల్లో పోషకలోప నివారణకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో కూడిన బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్‌) పంపిణీ చేస్తోంది. భవిష్యత్తులో ప్రజా పంపిణీ ద్వారా మొత్తం ఇలాంటి బియ్యమే ఇవ్వాలన్నది కేంద్ర లక్ష్యం. ప్రభుత్వం నగదు బదిలీ అమలుచేస్తే.. వీరికి బలవర్ధక బియ్యం అందదు.

ఇచ్చే నగదు.. మద్యానికి వెళ్తే?

నగదు బదిలీ ద్వారా ప్రభుత్వం కార్డుదారుల ఖాతాల్లో నగదు వేస్తుంది. వీటిని బ్యాంకు నుంచి తీసుకున్నాక.. బియ్యమే కొనుక్కుంటారని చెప్పలేం. ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చు. కొందరు మద్యం తలుపు తట్టవచ్చని రేషన్‌ డీలర్ల సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు పస్తులతో గడపాల్సిన పరిస్థితికి దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని కార్డులకే అంటున్నా..

ప్రయోగాత్మక అమల్లో భాగంగా ఆహార భద్రతా చట్టం పరిధిలో లేని కార్డులకే నగదు బదిలీ వర్తింపజేయాలని పౌరసరఫరాలశాఖ చెప్పింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రస్తుత విధానాన్ని సరిదిద్దడంతో పాటు మరింత సమర్థంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలు చేయడానికే నగదు బదిలీ అని చెబుతోంది. కార్డుదారుల కోరిక మేరకే నగదు బదిలీ అమలు చేస్తామని అంటోంది. ఇందుకోసం వాలంటీరు ఇచ్చే ఒప్పందపత్రం మీద సంతకం చేయాలి. కార్డు రద్దుకాదని, బియ్యం తప్ప మిగిలిన సరకులు తీసుకోవచ్చని వాలంటీరు తనకు చెప్పినట్లు ఆ పత్రంలో ఉంటుంది. అయితే, ఇది ఎన్ని నెలలకు? మధ్యలో బియ్యం కావాలనుకుంటే ఎవర్ని సంప్రదించాలనే ప్రశ్నలకు సమాధానం లేదు. ప్రస్తుతానికి ఆహార భద్రతా చట్టం పరిధిలో లేని కార్డులకే అమలు చేస్తామంటున్నా.. భవిష్యత్తులో అన్ని కార్డులకూ వర్తింపజేసే అవకాశాలూ లేకపోలేవు.

నెలకు 90% కార్డులకు రేషన్‌

రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 90% కుటుంబాలు రేషన్‌ తీసుకుంటున్నాయి. ఒకటో తేదీ నాటికి ఈ బియ్యం అందకపోతే పూట గడవని కుటుంబాలు.. చాలానే ఉన్నాయి. బియ్యం తీసుకోకుంటే కార్డు రద్దవుతుందనే భయంతో తీసుకునేవారూ ఉన్నారు. వీరిలో కొందరు తీసుకున్న బియ్యాన్ని అమ్ముకుంటారు. సుమారు 25 లక్షలకు పైగా కుటుంబాలు.. వలస పోయిన ప్రాంతంలో రేషన్‌ తీసుకుంటున్నాయి. భర్త ఒకచోట, భార్య మరోచోట ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఒకచోట ఉన్న భర్త బియ్యం వద్దని నగదు తీసుకుంటే.. మరోచోట ఉండే భార్యకు బియ్యం ఇవ్వరు. పనులు లేకపోతే పస్తులుండాలి. ‘మా రేషన్‌ దుకాణం పరిధిలోని 900 కార్డుల్లో 75% బియ్యం వినియోగించుకునేవారే.. పూర్తిగా వాటినే కాకుండా సన్న బియ్యం కలిపి వండుకుంటారు’ అని విజయవాడ పటమట ప్రాంతానికి చెందిన డీలర్‌ ఒకరు వివరించారు. ‘పనులు దొరక్కపోయినా, పంటలు లేకపోయినా.. తినడానికి బియ్యం అందుతున్నాయి. గడచిన ఖరీఫ్‌లో పంటలు పోయి, పనులు దొరక్క ఉపాధి పోయిన సమయంలో.. రేషన్‌ బియ్యమే ఆదుకున్నాయి’ అని గుంటూరు జిల్లాకు చెందిన రైతు కూలీలు వివరించారు.

పేదలకు ఆహార భద్రత ఉండదు

నగదు బదిలీతో పేదలకు ఆహార భద్రత ఉండదు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతాయి. ధాన్యం సేకరణపైనా ప్రభావం పడుతుంది. నాసిరకం ఇవ్వడం వల్లే రేషన్‌ కార్డుదారులు వాటిని వినియోగించడం లేదు. మంచి బియ్యం ఇస్తే అవే తింటారు. బియ్యం తీసుకోవడం లేదని రేషన్‌ కార్డు ఎందుకని భవిష్యత్తులో అంటారు. ప్రజలు దీన్ని ప్రతిఘటించాలి.- సీహెచ్‌ బాబూరావు,సీపీఎం కార్యదర్శివర్గ సభ్యులు

ప్రతిబంధకాలెన్నో..

బియ్యానికి నగదు బదిలీలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి. కేంద్రం గతంలోనే ఈ విధానం అమలు చేయాలని లేఖలు రాసినా.. రాష్ట్రాలు పక్కన పెట్టాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుచేసినా.. అక్కడా ఫలితాలు ఆశాజనకంగా లేవు. ఇందులో గుర్తించిన అంశాలు..

*పేద కుటుంబాల్లో నగదు బదిలీకి ముందునాటి బియ్యం వినియోగ స్థాయి లేదు. కిలోకి ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కంటే మార్కెట్లో బియ్యం ధర ఎక్కువ. కిరాణా దుకాణాల్లో ధరలు మరింత పెంచారు.

*ఖాతాలో నగదు జమ అయిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకులకు వెళ్తున్నారు. దీంతో రోజు కూలీల పని సమయం వృథా అవుతోంది. ఫోన్‌ నెంబరు మారిస్తే.. సందేశం రాదు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకులు ఉండవు. వీరు పట్టణానికి వచ్చినప్పుడే తీసుకోవాలి.

త్వరలో రేషన్‌ సరకుల స్థానే నగదు : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలº దేశంలోనే వినూత్నంగా సాగుతున్న ఇంటింటికీ రేషన్‌ సరకుల పంపిణీలో త్వరలో మార్పులు తెస్తామని, ప్రజలకు నేరుగా నగదు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు నోరెత్తలేని విధంగా ప్రస్తుత పథకాలను మరింత మెరుగుపరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. ప్రతి పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని, తమ ఉనికి కోల్పోతామని ప్రతిపక్షాలు వాటిపై తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాయని అన్నారు. ఉదయభాను మాట్లాడుతూ అనుభవజ్ఞులైన నాగేశ్వరరావు సారథ్యంలº పౌరసరఫరాల శాఖ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి:రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై బియ్యం వద్దంటే డబ్బులు!

ABOUT THE AUTHOR

...view details