డిసెంబరు 1న తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఇందులో ఏ పార్టీకీ మేయర్‌ను ఎన్నుకునే స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. ప్రస్తుత పాలకవర్గం గడువు ఫిబ్రవరి 10తో పూర్తి కానుంది. ఆ మర్నాడే కొత్త పాలకవర్గ ఏర్పాటుకు ఎన్నికల సంఘం ముహూర్తం నిర్ణయించింది. పూర్తి స్థాయి మెజార్టీ లేకపోవడంతో కో-ఆప్షన్ సభ్యుల ఆధారంగా మేయర్ పీఠం తెరాస దక్కించుకుంటుందని అంతా భావించారు. కాని సాధారణ మెజార్టీతో దక్కించుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. వచ్చే నెల 11న తమ కార్పొరేటరే మేయర్ పీఠంపై కూర్చుంటారని నగరానికి చెందిన అధికార పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఆ రోజు సగం మంది సభ్యులు హాజరైనా కోరం సరిపోతుందని చెబుతున్నారు. ఎన్నికైన కార్పొరేటర్లందరూ ప్రమాణం చేయాల్సి ఉన్నందున అన్ని పార్టీల కార్పొరేటర్లు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సాధారణ మెజార్టీ అంటే...
బల్దియా ఎన్నికల్లో తెరాస 56 స్థానాలు గెలుచుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎంఐఎం, భాజపా చేతులు కలిపి తమ కార్పొరేటర్ అభ్యర్థిని నిలిపితే తెరాస అభ్యర్థి గెలవడం కష్టమవుతుంది. ఈ కలయిక సాధ్యపడే అవకాశం లేదు. ఒక వేళ రెండు పార్టీలు వేర్వేరుగా అభ్యర్థిని నిలిపినా సాధారణ మెజార్టీతో తెరాస అభ్యర్థి సులభంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మెజార్టీ లేకపోవడంతో భాజపా మేయర్ బరిలో నిలిచే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంఎంఐ బరిలోకి దింపుతుందా.. లేక తమ కార్పొరేటర్లను ఓటు హక్కు వినియోగించుకోవద్దని చెబుతుందా.. లేక ప్రమాణం స్వీకారం పూర్తయిన తరువాత మేయర్ ఎన్నిక సమయంలో సభను వీడి వెళ్లిపోమంటుందా అన్న విషయం తేలాల్సి ఉంది.