పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బల్దియా ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్లు తీర్పును బ్యాలెట్‌బాక్సులో నిక్షిప్తం చేశారు. 45.71 శాతం పోలింగ్ నమోదైనట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్ తెలిపారు. 150 డివిజన్లకు గాను... 1,122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెరాస అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా.. భాజపా అభ్యర్థులు 149 చోట్ల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ 146, తెదేపా 106, మజ్లిస్ 51 డివిజన్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. మొత్తం 9,101 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగగా... ఈ నెల 4న జరిగే లెక్కింపులో 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.
3 తర్వాత పుంజుకుంది..
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలి నుంచి మందకొడిగా కొనసాగింది. ఏదో కొన్ని డివిజన్లు మినహాయిస్తే... ఓటు వేసేందుకు జనం పెద్దగా ఆసక్తికనబర్చలేదు. ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం పోలింగ్ నమోదైంది. ఏ పోలింగ్ బూత్‌ల్లోనూ ఓటర్ల సందడిగా పెద్దగా కనిపించలేదు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 18.22 శాతం పోలింగ్ నమోదు కాగా... 14 డివిజన్లలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 5 శాతం కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. కేవలం 10డివిజన్లలో మాత్రమే ఒంటి గంట వరకు 40 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అమీర్ పేట, తలాబ్ చంచలం డివిజన్లలలో కనీసం ఒక్కశాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. సాయంత్రం 3 వరకు 25.34 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటి నుంచి ఓటింగ్ కాస్తా పుంజుకుంది.
ఓట్ల గల్లంతు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన యువతీ యువకులంతా గ్రేటర్ ఎన్నికల్లోనూ వినియోగించుకున్నారు. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో అటు యువతీయువకులు ఇటు వృద్ధులు ఓటు వేసి ఓటరు బాధ్యతలను గుర్తు చేశారు. ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు గల్లంతయ్యాయని పలుచోట్ల ఓటర్లు ఆందోళన చేపట్టారు. జియాగూడలోని బూత్ నంబర్ 36, 37, 38లో సుమారు మూడు వేల ఓట్లు గల్లంతయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఇంద్రానగర్‌లో ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్‌లో కేటాయించారని వాపోయారు.
నిరంతర పరిశీలన