గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 30 కేంద్రాల్లో జరగనుంది. డివిజన్ల వారీగా కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 166 కౌంటింగ్ టేబుళ్లలో లెక్కింపు చేపడతారు. ఒక్కో కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి లెక్కింపును పర్యవేక్షిస్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో పరిశీలకుడిని నియమించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు.
ఏజెంట్లకు రిలీవింగ్ లేదు..
అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉంటుంది. అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ఎస్ఈసీ, ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ఏజెంట్లకు రిలీవింగ్ సౌకర్యం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లను నిషేధించారు. ఏజెంట్లందరూ విధిగా ముందుగానే రిటర్నింగ్ అధికారుల వద్ద పాసులు తీసుకోవాలి. పాసులు లేని వారికి అనుమతి లేదని ఎస్ఈసీ తెలిపింది.
మధ్యాహ్నం మూడు గంటల్లోపు..
మొదటగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత రెగ్యులట్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడతారు. మొదటగా పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ప్రాథమిక లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల్లోపు, మెజార్టీ వార్డుల పూర్తి లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.