జీహచ్‌ఎంసీ పరిపాలన విభాగం(GHMC Administration Division) వసూళ్లకు అడ్డాగా మారింది. పదోన్నతులు, బదిలీలు, ఇతర శాఖల వారిని నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్‌ఎంసీలో కొనసాగించడం, ఇతరత్రా పనులకు అధికారులు ధరలు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అయితే.. వ్యక్తిగత సహాయకుడు, ఇతర సిబ్బందిని వసూళ్లకు పంపిస్తున్నారు. హోటళ్లలో కూర్చుని బేరాలు కుదుర్చుకుంటున్నారు. అక్కడే ముడుపులు చేతులు మారుతున్నాయి. మరోవైపు.. డబ్బు ఇవ్వని ఉద్యోగుల దస్త్రాలను పరిపాలన విభాగం(GHMC Administration Division) తొక్కి పెడుతోంది. సీనియర్లకు హక్కుగా రావాల్సిన పదోన్నతిని.. అంగట్లో సరుకుగా మార్చింది. తాజాగా విషయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన విచారణకు ఆదేశించారు.
సీఎస్‌కు ఫిర్యాదు చేయడంతో...
ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన ప్రతి ఉద్యోగికీ పదోన్నతి ఇవ్వాలని చెబుతుంటే.. జీహెచ్‌ఎంసీ పరిపాలన విభాగం(GHMC Administration Division) మాత్రం ఐదేళ్లపాటు ఇవ్వబోమని షరతు పెట్టింది. డబ్బులు ఇస్తే మాత్రం ఐదేళ్ల సర్వీసుతో సంబంధం లేకుండా పదోన్నతి ఇస్తుంది. అందుకు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఉదంతమే ఉదాహరణ. రోహిత్‌కుమార్ అనే ఉద్యోగికి తగిన సర్వీసు లేనప్పటికీ పదోన్నతి వచ్చింది. సహోద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పరిపాలన విభాగం అధికారి లంచం తీసుకున్నట్లు తేలడంతో కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ వెంటనే పదోన్నతి ఉత్తర్వును రద్దు చేయడం గమనార్హం.
గతంలోనూ ఇంతే..
కమిషనర్ అనుమతి తీసుకుని ఆరోగ్య విభాగం అదనపు కమిషనర్ గతంలో ఓ అధికారిపై వేటు వేస్తూ, అతన్ని మాతృసంస్థకు పంపించాలని పరిపాలన విభాగాన్ని(GHMC Administration Division) కోరారు. అక్కడి ఓ అధికారి ఆ దస్త్రాన్ని ఆపుతానంటూ హోటల్‌లో వేటుకు గురైన అధికారితో రూ.2.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బు ముట్టడంతో దస్త్రాన్ని తొక్కిపెట్టారు. విషయం తెలుసుకున్న కమిషనర్.. ఆ అధికారిని బదిలీ చేశారు. ప్రణాళిక విభాగంలో సెక్షన్ ఆఫీసరుగా హోదా ఇవ్వాలని మరో ఉద్యోగి రూ.40వేలు లంచం ఇచ్చారు. డబ్బు ఇచ్చినా పని చేయలేదంటూ అప్పట్లో ఆ ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఓ ఉన్నతాధికారి అండతో వసూళ్లు కొనసాగుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. పరిపాలన విభాగాన్ని చక్కదిద్దాలని కోరుతున్నారు.