రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు నుంచి జూన్ వరకు ఎన్నికల హోరు కనిపించనుంది. వివిధ రకాల ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్... స్వయంగా మంత్రులకు తెలిపారు. మార్చి 15లోగా స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు మంత్రివర్గ సమావేశంలో సీఎం చెప్పినట్లు సమాచారం. మే, జూన్ నెలల్లో సహకార సంఘాలు, నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు.
పరిపాలనపై దృష్టి...
జూన్ నాటికి వైకాపా ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతుంది. ఆలోగా అన్ని రకాల ఎన్నికలను పూర్తి చేసి తర్వాత పరిపాలనపైనే దృష్టి కేంద్రీకరించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే స్థానిక, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంత త్వరగా ఎన్నికలకు వెళితే ప్రచారానికి సమయం సరిపోదని కొందరు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్నికలను వీలైనంత త్వరగానే జరపనున్నట్లు సీఎం చెప్పారు. అందుబాటులో ఉన్న సమయానికి తగ్గట్లుగా ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ