ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Coal storage : 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలపై జెన్‌కో దృష్టి - Genco focuses on 10 lakh tonnes of coal storage

వేసవిలో పెరిగే విద్యుత్‌ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ ప్లాంట్ల దగ్గర కనీసం 10 లక్షల టన్నుల బొగ్గును నిల్వ చేయాలని జెన్‌కో నిర్ణయించింది. బొగ్గు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉత్పత్తి సంస్థల బకాయిలు, రైలు రవాణా ఛార్జీల చెల్లింపు కోసం రూ.600 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

బొగ్గు నిల్వలపై జెన్‌కో దృష్టి
బొగ్గు నిల్వలపై జెన్‌కో దృష్టి

By

Published : Oct 25, 2021, 5:19 AM IST

వేసవిలో పెరిగే విద్యుత్‌ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని థర్మల్‌ ప్లాంట్ల దగ్గర కనీసం 10 లక్షల టన్నుల బొగ్గును నిల్వ చేయాలని జెన్‌కో నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ప్రణాళికను రూపొందిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా వచ్చే నిల్వలు రోజువారీ విద్యుత్‌ ఉత్పత్తికే సరిపోతున్నాయి. వాతావరణ మార్పులతో నవంబరు రెండో వారం తర్వాత విద్యుత్‌ డిమాండ్‌ తగ్గుతుందని అధికారుల అంచనా. దీనికితోడు బహిరంగ మార్కెట్‌లో చౌక విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని విద్యుత్‌ సంస్థలు భావిస్తున్నాయి. అప్పటి నుంచి థర్మల్‌ ఉత్పత్తి తగ్గించి జనవరి నాటికి బొగ్గు నిల్వలను పెంచుకునేలా ప్రణాళిక రూపొందించింది. బొగ్గు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉత్పత్తి సంస్థల బకాయిలు, రైలు రవాణా ఛార్జీల చెల్లింపు కోసం రూ.600 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వేసవిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 230 ఎంయూలకు చేరే అవకాశం ఉందని విద్యుత్‌ సంస్థలు భావిస్తున్నాయి.

సింగరేణి నుంచి మొదలైన సరఫరా

* సింగరేణి నుంచి బొగ్గు సరఫరా మొదలైంది. ప్రస్తుతం విజయవాడ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు(వీటీపీఎస్‌)కు 22 రైల్వే రేక్‌లు (సుమారు 65 వేల టన్నులు), రాయలసీమ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటు (ఆర్‌టీపీపీ)కు 8 రేక్‌లు వస్తున్నాయి.

* ప్రస్తుతం వీటీపీఎస్‌లో 30,250 టన్నులు, ఆర్‌టీపీపీలో 80 వేల టన్నులు, కృష్ణపట్నంలో 53 వేల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంటులో వినియోగించాల్సిన 30 శాతం విదేశీ బొగ్గు అందుబాటులో లేని కారణంగా అక్కడ కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని 5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం వారం కిందట జారీ చేసిన షార్ట్‌ టెండరు ప్రకటనను అధికారులు సోమవారం పరిశీలించే అవకాశం ఉంది. బొగ్గు కొరత కారణంగా టన్ను రూ.13-15 వేల మధ్య ధర ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో టన్ను 7 వేలకే సరఫరా చేశారు. యూనిట్‌ ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని టెండర్లపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.

* జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లను సుమారు ఏడాదిన్నర తర్వాత పూర్తిస్థాయిలో ఉత్పత్తిలో ఉంచారు. అన్ని ప్లాంట్లు పనిచేయటానికి రోజూ సుమారు 70 వేల టన్నుల బొగ్గు అవసరం ఉంటే.. ప్రస్తుతం 40-45 టన్నుల బొగ్గును వినియోగించి ఉత్పత్తి చేస్తున్నారు. జల విద్యుత్‌ ప్లాంట్ల నుంచి రోజూ సుమారు 23 ఎంయూల విద్యుత్‌ వస్తోంది.

* పునరుత్పాదక విద్యుదుత్పత్తి గత నాలుగైదు రోజుల్లో సుమారు 14 ఎంయూలు పెరగటంతో విద్యుత్‌ సరఫరాకు కొంత వెసులుబాటు కలిగింది. రాష్ట్రంలో ఈ నెలలో విద్యుత్‌ డిమాండ్‌ 197-202 మిలియన్‌ యూనిట్ల మధ్య ఉంటోంది.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details