పోలీసుశాఖకు చెందిన కొందరు దిగువస్థాయి అధికారులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు(ఎస్‌హెచ్‌వో) చట్ట నిబంధనలు పాటించడంలేదని, విధినిర్వహణలో వారు విఫలమవుతున్నారని హైకోర్టు ఆక్షేపించింది. కొందరి నిర్లిప్తత(ఇన్‌యాక్షన్), విపరీత ప్రవర్తన/అత్యుత్సాహం(ఓవరాక్షన్), ప్రభుత్వానికి సలహాదారులు న్యాయపరమైన సూచనలు సరిగా ఇవ్వని కారణంగా ఉన్నతాధికారులు న్యాయస్థానాల్లో నిలబడాల్సి వస్తోందని కోర్టుకు హాజరైన డీజీపీ గౌతం సవాంగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. చిన్నకేసులో మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని డీజీపీని కోరింది. మీ నిబద్ధత గురించి తెలుసని.. ఈ కేసులోనూ మీకు న్యాయసలహా సక్రమంగా ఇవ్వకపోవడంతోనే ఇక్కడ నిలబడాల్సి వచ్చిందని వ్యాఖ్యానించింది. ఏ వ్యక్తికి, అధికారికి, ఏ ప్రభుత్వానికి న్యాయస్థానం వ్యతిరేకం కాదని స్పష్టంచేసింది. కరోనా సమయంలో పోలీసులు చక్కగా సేవలందిస్తున్నారని పేర్కొంది.
న్యాయ సలహాదారులు తగిన విధంగా సహకరించకపోవడం వల్లే కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తోందని తెలిపింది. కొందరు ప్రభుత్వానికి న్యాయస్థానం వ్యతిరేకమా?అనే భావనలో ఉన్నారంది. కోర్టులున్నది రాజ్యాంగ, చట్ట నిబంధనల రక్షణ కోసమేని తెలిపింది. ప్రభుత్వానికి సక్రమమైన సలహాలు, సూచనలు చేయకుండా కోర్టులను నిందిస్తే ప్రయోజనముండదని పేర్కొంది. మద్యం అక్రమ రవాణా కేసులో స్వాధీనానికి గురైన వాహనాల విషయంలో డీజీపీ నుంచి వివరాలు సేకరించి కోర్టుకు తెలపాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్‌ను ఆదేశిస్తే..సహాయ ప్రభుత్వ న్యాయవాది(ఏజీపీ) కోర్టులో మెమో దాఖలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టుకు తోడ్పాటు అందించాల్సిన బాధ్యత ఏజీది కాదా?అని ప్రశ్నించింది. ఏజీ, ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), ఏజీపీలు న్యాయస్థానం ప్రతిష్ఠను పెంచేలా వ్యవహరించాలని హితవుపలికింది. కేవలం మెమో దాఖలుచేయడం తప్ప..కోర్టు కోరిన వివరాలు అందులో లేవని ఆక్షేపించింది. ఆ మెమోను స్వయంగా పరిశీలించాలని డీజీపీని కోరింది.