ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NIAB: ఎన్‌ఐఏబీలో కరోనా వ్యాక్సిన్ల టెస్టింగ్​ ల్యాబ్..

By

Published : Aug 22, 2021, 11:58 AM IST

ఎన్‌ఐఏబీలో(NIAB) కేంద్రీయ ఔషధ ప్రయోగశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. కరోనాతో(CORONA) పాటు ఇతర టీకాల పరీక్షలు(VACCINE TESTING), నిర్వహణకు అనుగుణంగా ఎన్‌ఐఏబీ హోదాను పెంచుతున్నట్లు కేంద్రం తాజాగా గెజిట్ విడుదల చేసింది. దీని ఏర్పాటుతో నెలకు 60 బ్యాచ్‌ల టీకాల పరీక్ష, ధ్రువీకరణ సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.

Corona Vaccine Testing Lab
కరోనా వ్యాక్సిన్ల టెస్టింగ్​ ల్యాబ్

టీకాల పరీక్ష, ధ్రువీకరణకు అనువుగా కేంద్రం గతంలో మంజూరుచేసిన కేంద్రీయ ఔషధ ప్రయోగశాల(సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబొరేటరీ, CDL)ను హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జాతీయ జంతు జీవ సాంకేతిక సంస్థ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయో టెక్నాలజీ-NIAB)లో ఏర్పాటు చేయనున్నారు. కరోనాతో(CORONA) పాటు ఇతర టీకాల పరీక్షలు, నిర్ధారణకు అనుగుణంగా ఎన్‌ఐఏబీ హోదాను పెంచుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రధానమంత్రి సహాయ నిధి (PM CARES FUND) నుంచి దీనిని నిర్వహిస్తామని ప్రకటించింది. దీని ఏర్పాటుతో నెలకు 60 బ్యాచ్‌ల టీకాల పరీక్ష, ధ్రువీకరణ సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. టీకాల తయారీ, సరఫరా మరింత సులభమవుతుందని తెలిపింది.

వ్యయప్రయాసలకు శాశ్వత పరిష్కారం

ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కసౌలి, దిల్లీకి(DELHI) సమీపంలోని నోయిడాలో జాతీయ టీకా పరీక్ష, ధ్రువీకరణ (VACCINE TESTING AND CERTIFICATION) కేంద్రాలున్నాయి. వాటినే ఔషధ ప్రయోగశాలలుగా పిలుస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి కసౌలి 1,871 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి టీకాలు తీసుకెళ్లి పరీక్షలు చేయించి, ధ్రువీకరణ పొందడానికి 45 నుంచి 60 రోజులు పడుతోంది. కరోనా సమయంలో ఇది ఔషధ సంస్థలకు ఇబ్బందిగా పరిణమించింది. టీకాల లభ్యతలో జాప్యానికీ కారణమైంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌(KTR) సమస్యలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. స్పందించిన కేంద్రం హైదరాబాద్‌, పుణెలలో కొత్తగా 2 సీడీఎల్‌లను(CDL)న మంజూరు చేసింది.

జీనోమ్‌వ్యాలీ ఉన్నా

తెలంగాణ ప్రభుత్వం జినోమ్‌వ్యాలీలో(Genome Valley) ఈ ప్రయోగశాల ఏర్పాటుచేయాలని కోరింది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో కేంద్రం ఎన్‌ఐఏబీ వైపే మొగ్గుచూపింది. కేంద్ర జీవ సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో వంద ఎకరాల విస్తీర్ణంలో 2010లో ఎన్‌ఐఏబీ ఏర్పాటైంది. అందులో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో 15 ఎకరాలను సీడీఎల్‌కు కేటాయిస్తున్నట్టు తాజా గెజిట్‌లో కేంద్రం పేర్కొంది. రెండు, మూడు నెలల్లో అవసరమైన పరికరాలు, సిబ్బంది సహా కేంద్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్త భవనాలు నిర్మించే పక్షంలో ఏడాదిలోపు పూర్తయ్యే వీలుంది.

అన్ని విధాలా సహకారం

సీడీఎల్‌ ఏర్పాటు రాష్ట్రానికి... ఔషధ, జీవశాస్త్ర రంగాలకు గొప్ప ఊతమిస్తుంది. ఇతర దక్షిణాది రాష్ట్రాలకూ లబ్ధి చేకూరుతుంది. ఔషధ పరిశ్రమలకు వ్యయప్రయాసలు తగ్గడంతోపాటు..తయారైన టీకాలు సత్వరమే ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఇది దోహదం చేస్తుంది. కేంద్రం ఏర్పాటుకు అవసరమైన పూర్తిసహకారం అందిస్తామని ఇప్పటికే మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

- జయేశ్‌ రంజన్‌, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి.

ఇదీ చదవండి:Dogs killed: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details