ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసలు ధర ఆకాశానికి.. రాయితీ పాతాళానికి! - గ్యాస్​ ధరల పెంపు తాజా వార్తలు

ఓవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు వంటిట్లో ఉండే గ్యాస్‌ బండ కూడా వినియోగదారులకు గుదిబండలా మారుతోంది. గత కొద్దిరోజులుగా వంటగ్యాస్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. ఇంటి అవసరాలకు ఉపయోగించే సిలిండర్‌పై రూ. 25.50 పెరిగింది.

gas rate hike
gas rate hike

By

Published : Jul 2, 2021, 8:57 AM IST

పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలకు ఇప్పుడు వంట గ్యాస్‌ తోడైంది. గృహ వినియోగ సిలిండర్‌ (14.2 కిలోలు) ధర రూ.25.50 పెరిగింది. గత ఏడు నెలల్లో ఒక్కో సిలిండర్‌పై రూ.240 పైగా భారం పడింది. ఒక సిలిండర్‌ కొనాలంటే రూ.850 (ప్రాంతాల వారీగా హెచ్చు తగ్గులుంటాయి)పైనే వెచ్చించాల్సి వస్తోంది. నగదు బదిలీ రూపంలో వినియోగదారులకు వచ్చే రాయితీ మాత్రం రూ.15 నుంచి రూ.16కే పరిమితమైంది. కరోనా ప్రభావంతో ఆదాయం పడిపోయిన పరిస్థితుల్లో గ్యాస్‌ ధరల పెరుగుదల మరీ భారంగా మారుతోంది.

రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు 1.42 కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 1.15 కోట్ల కుటుంబాలు మాత్రం ప్రతి నెలా గ్యాస్‌ తీసుకుంటాయని ఓ అంచనా. ఒక్కో సిలిండర్‌పై రూ.25 పెరగడం వల్ల ఈ కుటుంబాలపై నెలకు రూ.28.75 కోట్ల భారం పడుతోంది. రాష్ట్రంలో 2020-21లో 12,21,000 టన్నుల గ్యాస్‌ గృహ అవసరానికి వినియోగించారు. గతేడాది నవంబరులో రూ.616 ఉన్న సిలిండర్‌ ధర ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.816 అయింది. అంటే మూడు నెలల్లోనే రూ.200 వరకు వెళ్లింది. మార్చిలో రూ.25 పెంచి, ఏప్రిల్‌లో రూ.10 తగ్గించారు. ఇప్పుడు మళ్లీ రూ.25.50 పెంచారు.

తగ్గుతున్న రాయితీ
గతేడాది నుంచి గ్యాస్‌పై రాయితీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. సిలిండర్‌ ధర పెరుగుతున్నా.. వినియోగదారుడికి వచ్చే నగదు బదిలీ రూ.15కు మించడం లేదు. విశాఖపట్నంలో ఇది రూ.4 మాత్రమే జమ అవుతోంది.

  • గతేడాది మార్చిలో సిలిండర్‌ ధర రూ.833 ఉండగా.. నగదు బదిలీ రూపంలో రూ.255 వినియోగదారుల ఖాతాలో జమ అయింది. అంటే సిలిండర్‌ ధర రూ.578 అయ్యేది.
  • ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.857 ఉండగా.. రాయితీ రూ.15 మాత్రమే అందుతోంది. అంటే రూ.సిలిండర్‌ ధర రూ.842 అవుతోంది.
  • 2020 ఏప్రిల్‌ నుంచి రాయితీ భారీగా తగ్గుతూ వచ్చింది. జూన్‌లో రూ.20 వచ్చింది. కొన్ని నెలలుగా రూ.15 చొప్పునే జమ అవుతోంది.

68 లక్షల కుటుంబాలపై బండ

వంట గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోలేని పేద కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వివిధ పథకాల కింద మంజూరు చేస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం అలాంటి పేద కుటుంబాలు 68 లక్షల వరకు ఉన్నాయి. కనెక్షన్‌ తీసుకున్నాక సిలిండర్‌కు రూ.857 పైగా చెల్లించి కొనుగోలు చేయడం వీరికి భారంగా పరిణమిస్తోంది.

ఇదీ చదవండి:

JAGAN LETTER: ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్‌ లేఖలు

ABOUT THE AUTHOR

...view details