ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్టైరీన్ లీకేజీ... విశాఖలో విషాదం - ఏపీ వైజాగ్​లో గ్యాస్ లీకేజీ ప్రమాదం​

సొమ్మసిల్లిన మనుషులు.. ప్రాణాల కోసం పరుగులు.. మిన్నంటిన రోదనలు.. విగతజీవులైన పశువులు.. మసివాడిన మొక్కలు... ఇదీ విశాఖతీరంలోని హృదయ విదారకం. గ్యాస్​లీకేజీతో కొందరి బతుకు తెల్లారిపోయింది. మరికొందరి జీవితం ఆస్పత్రి పాలైంది. తెలతెలవారుతుండగా సాగరతీరంలో చెలరేగిన ఆ ఉపద్రవంపై 'ప్రత్యేక కథనం'...

స్టైరీన్ లీకేజీ... విశాఖలో విషాదం
స్టైరీన్ లీకేజీ... విశాఖలో విషాదం

By

Published : May 7, 2020, 5:40 PM IST

ఆర్​ ఆర్ వెంకటాపురం గూగుల్ వ్యూ

విశాఖ నగరంలో మహా విషాదం చోటుచేసుకుంది. ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్టైరీన్‌ విషవాయువు లీకైంది. కరోనా వైరస్‌ విజృంభణతో ఇప్పటికే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న విశాఖ వాసులపైకి ఈ రసాయన వాయువు మృత్యు రూపంలో దూసుకొచ్చింది. అందరూ గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా ఉపద్రవం ముంచుకొచ్చింది. నిద్రలేచే లోపే ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియని హృదయవిదారక పరిస్థితి నెలకొంది. విషవాయువు పీల్చిన జనం రోడ్లపైకి వచ్చి ఉక్కిరిబిక్కిరై స్పృహ తప్పి పడిపోయిన దృశ్యాలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.

సహాయక చర్యలు

11 మంది మృతి..

ఇప్పటివరకు 11 మంది మృత్యువాతపడగా.. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ అధికారికంగా ప్రకటించారు. బాధితులు విశాఖలోని కేజీహెచ్‌, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులే అధికంగా ఉన్నారు. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ చేరుకుని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు.

బాధితులు రోదనలు

ఈ గ్రామాల్లోనే అధికంగా..

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ నుంచి లీకైన స్టైరీన్‌ విషవాయువు ప్రభావం ఐదు గ్రామాలపై అధికంగా ఉంది. గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురం, పద్మనాభనగర్‌, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రినగర్‌లలో మొత్తం 10 వేల కుటుంబాలు ఉంటాయి. వీరిలో దాదాపు 2వేల మందికి పైగా ఇళ్లల్లోనే ఉండిపోవడం వల్ల ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ దళాలు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు ప్రయత్నించాయి. ఉదయం 5గంటల నుంచి ఇళ్లల్లో అచేతనంగా పడి ఉన్నవారిని తలుపులు బద్దలుకొట్టి మరీ బయటకు తీసుకొచ్చి ఆస్పత్రులకు తరలించారు. అంబులెన్స్‌లతో పాటు కార్లు, ద్విచక్రవాహనాలపై క్షతగాత్రులను ఇతర ప్రాంతాలకు చేరవేశారు.

అపస్మారక స్థితిలో మహిళలు, చిన్నారులు

మృతుల వివరాలివే. .

వేపగుంటలో ఎల్జీ పాలిమర్స్‌ నుంచి లీకైన స్టైరీన్‌ మృత్యు ఘంట మోగించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి వివరాలు కుందన్‌ శ్రేయ, ఎన్‌. గ్రీష్మ, చంద్రమౌళి, గంగాధర్‌, నారాయణమ్మ, అప్పలనరసమ్మ, గంగరాజు, మేకా కృష్ణమూర్తి, రత్నాల గంగాధర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు.

దిక్కుతోచక..

గ్యాస్‌ లీకైన ఘటనతో ముందే అప్రమత్తమైన పలు గ్రామాలకు చెందిన వారు నగరంలోని వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాల వైపు పరుగులు పెట్టారు. అక్కడే రోడ్లపై సేదతీరుతున్నారు. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో విలపిస్తూ నరకయాతన పడుతున్నారు.

నల్లబారిన చెట్లు, మృత్యువాతపడిన పశువులు

నిర్జీవంగా మూగజీవాలు.. రంగుమారిన చెట్లు

గ్యాస్‌ ప్రభావంతో ఆయా గ్రామాల్లోని మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. రహదారులపై పశువులతో పాటు పక్షులు, కోళ్లు ఎక్కడికక్కడ నిర్జీవంగా పడి ఉండటం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. స్టైరీన్‌ తీవ్రతకు చెట్లు సైతం నలుపు, ఎరుపు రంగుల్లోకి మారిపోయి కనిపించాయి.

ఎల్​జీ గ్యాస్ లీకేజీ ప్రాంతం

కంపెనీ ప్రతినిధులేమన్నారు?

ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధులు స్పందించారు. లాక్‌డౌన్‌తో 45 రోజుల పాటు మూసి ఉన్న కారణంగా గ్యాస్‌ ఎక్కువగా నిల్వ ఉందని తెలిపారు. గ్యాస్‌ ట్యాంక్‌ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నా.. దురదృష్టవశాత్తు విషాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ మినహాయింపు నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఈ పరిశ్రమ నడుస్తోంది. బుధవారం రాత్రి షిప్ట్‌లో 15మంది ఉన్నారు. అందులో ఉన్నవారెవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. వారంతా సురక్షితంగానే ఉన్నట్టు సమాచారం.

అదుపులోనే ఉంది: సీపీ ఆర్కే మీనా

ఈ ఘటన జరిగిన తర్వాత సహాయక సిబ్బంది, రక్షణ దళాలు ముందుగా ఇళ్లల్లో ఉన్నవారందరినీ ఖాళీ చేయించారని సీపీ ఆర్కే మీనా వెల్లడించారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన సురక్షిత ప్రాంతాలకు వారిని తరలిస్తున్నామన్నారు. గ్యాస్​ తీవ్రతకు ఎంతమంది ప్రభావితమయ్యారనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందన్నారు.

బాధితులకు అండగా సింహాచలం దేవస్థానం..

గ్యాస్ లీకైన ఘటనలో బాధితులకు సింహాచలం దేవస్థానం అండగా నిలబడింది. ఆయా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వందలాది మంది బాధితులకు ఈవో వెంకటేశ్వరరావు స్వయంగా సౌకర్యాలు కల్పించారు. వసతితో పాటు అల్పాహారం అందించారు. మధ్యాహ్నం వీరందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులు సురక్షితంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాలని ఆయన సూచించారు. సింహాచలం వచ్చేవారికి దేవస్థానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి:విశాఖ మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం

ABOUT THE AUTHOR

...view details