ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GANESH IMMERSION: కోలాహలంగా గణేశ్ నిమజ్జనాలు.. పలుచోట్ల అపశ్రుతులు

రాష్ట్రవ్యాప్తంగా వినాయకుని నిమజ్జన సందడి మొదలైంది. మూడు రోజులు పూర్తవడంతో చాలా చోట్ల విఘ్నేశ్వరుడ్ని ఊరేగించి నిమజ్జనం చేశారు. చాలావరకు ఉత్సవాలు ప్రశాంతంగానే సాగినప్పటికీ.. కొన్నిచోట్ల అపశ్రుతులు, ఉద్రిక్తతలు తలెత్తాయి.

GANESH IMMERSION
కోలాహలంగా వినాయక నిమజ్జనాలు

By

Published : Sep 13, 2021, 4:23 AM IST

రాష్ట్రవ్యాప్తంగా వినాయకుని నిమజ్జన సందడి

రాష్ట్రవ్యాప్తంగా గణనాథుడ్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. యువకులు ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొంటున్నారు. కొన్ని చోట్ల అపశ్రుతులు దొర్లాయి. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం జడ్డంగ వద్ద నిమజ్జనానికి వెళ్లి వాగులో పడి ఓ బాలుడు మృతి చెందగా... ఓ యువతి గల్లంతైంది. విజయవాడ నగర శివారు కండ్రిగలో నిమజ్జనం సందర్భంగా వైకాపా, తెలుగుదేశం నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇంద్రకీలాద్రిపై 3 రోజుల పాటు సాగిన వినాయక చవితి ఉత్సవాలు.. పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

స్వల్ప ఉద్రిక్తతలు.. కోలాహలంగా నిమజ్జనాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో విఘ్నేశ్వరుడి నిమజ్జనం సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పెదవడ్లపూడిలో డీజేతో వెళ్తున్న ఊరేగింపును పోలీసులు అడ్డుకోగా... స్థానికులు పోలీసు వాహనానికి అడ్డంగా నిలిచారు. కాసేపటికి పోలీసులే వెనక్కి తగ్గి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎర్రబాలెంలో రెండు వర్గాలు ఎదురెదురుగా రావటంతో స్వల్ప తోపులాట జరిగింది. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరంలో నిమజ్జనాలను కోలాహలంగా నిర్వహించారు. కనిగిరి నియోజవర్గంలోనూ ఘనంగా వేడుకలు జరిగాయి. అయ్యలూరివారిపల్లె గ్రామంలో..లడ్డూను ఓ భక్తుడు 3.75లక్షలకు దక్కించుకున్నాడు.

గణనాథుడ్ని నిమజ్జనం..

కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగాయి. డోన్‌లో అబ్బిరెడ్డిపల్లె చెరువులో గణనాథుడ్ని నిమజ్జనం చేశారు. ఆలూరులో నిమజ్జన సమయంలో డీజేకు అనుమతి లేదంటూ పోలీసులు ఓ ఊరేగింపును నిలిపివేశారు. ఎమ్మిగనూరులో విగ్రహాలను తుంగభద్ర దిగువ కాలువలో నిమజ్జనం చేశారు. పాణ్యంలో యువకుల నృత్యాలు, డప్పుల మధ్య ఊరేగింపు ఘనంగా జరిగింది.

కడపలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వివిధ చోట్ల నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుపతిలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిమజ్జనాలు జరిగాయి. వినాయక సాగర్, వెంకటాపురం, చెన్నాయగుంట చెరువులలో నిమజ్జనానికి క్రేన్లను అందుబాటులో ఉంచారు. చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో కారుపై వినాయకుడిని ఊరేగిస్తూ తీసుకెళ్లిన యువకులు కల్యాణి డ్యాంలో నిమజ్జనం చేశారు.

ఇదీ చదవండి..

NEET Exam: రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన నీట్‌ పరీక్ష

ABOUT THE AUTHOR

...view details