సెప్టెంబర్ 10వ తేదీన వినాయక ఉత్సవాలు(Vinayak chaturthi 2021) ప్రారంభమవుతాయని.. తెలంగాణలోని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు వెల్లడించారు. సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం రోజు గణేష్ నిమజ్జనం ఉంటుందని తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించిన ముడిసరుకును సమయానికి అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వివరించారు.
గణేశ్ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నట్లు భగవంతరావు పేర్కొన్నారు. నిమజ్జన సమయానికి రోడ్లు బాగుండేలా చేయాలని జీహెచ్‌ఎంసీని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా మార్గదర్శకాల ప్రకారంగా మండపాల్లో అన్ని జాగ్రత్తలు చేపడతామని స్పష్టం చేశారు. మండపాల్లో దేశభక్తి, దైవభక్తి పాటలు మాత్రమే ఉండాలని సూచించారు. గణేశ్ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా.. కరోనా గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా వేడుకలు చేసుకోవాలని తెలిపారు. గతేడాది మాదిరిగానే నిమజ్జన సమయంలో అందరూ భౌతికదూరం పాటించాలని భగవంత్‌రావు కోరారు.
40 అడుగుల ఎత్తుతో కొలువుదీరనున్న గణపయ్య
ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి 40 అడుగుల ఎత్తుతో కొలువుదీరనున్నాడు. ఈ మేరకు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ విగ్రహ నమూనాను ఆవిష్కరించింది. ఈసారి పంచముఖ రుద్రమహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఎడమవైపున కాలానాగదేవత, కుడివైపు కాల విష్ణు విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. గణనాథుడికి ఇరువైపులా కృష్ణ కాళీ, కాళ నాగేశ్వరి మూర్తుల విగ్రహాలు ఉంచనున్నట్లు ఉత్సవకమిటీ వెల్లడించింది. కొవిడ్ నేపథ్యంలో గతేడాది 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో 40 అడుగుల పంచముఖ రుద్రమహాగణపతి విగ్రహం రూపుదిద్దుకోనుంది.