ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Funds For Navaratnalu: నవరత్నాలకే అధిక నిధులు?.. భారీగా పెరుగుతున్న అప్పు - budget of ap

మార్చిలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండోవారంలో ఎప్పుడైనా సభలో బడ్జెట్‌ సమర్పిస్తారు. రాష్ట్ర ఆదాయాలు ఇంకా పూర్తిగా గాడిన పడలేదని ప్రభుత్వం చెబుతోంది. ఉన్న కాస్తా నవరత్నాలకే కేటాయిస్తుండగా.. ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

funds for navaratnalu in ap
funds for navaratnalu in ap

By

Published : Mar 2, 2022, 7:23 AM IST

రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. మార్చిలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండోవారంలో ఎప్పుడైనా సభలో బడ్జెట్‌ సమర్పిస్తారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా తొలుత ఓటాన్‌ అకౌంట్‌ రూపంలో బడ్జెట్‌ సమర్పించడమో లేక ఆర్డినెన్సు రూపంలో తొలుత ఆమోదం తీసుకుని ఆనక చట్టసభల ఆమోదం పొందడమో చేసేవారు. 2019లో ఎన్నికల కారణంగా తొలుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమర్పించి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్‌ సమర్పించారు. తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్‌కు కరోనా అడ్డంకిగా మారింది. ఇలా మార్చి నెలలోపు పూర్తి బడ్జెట్‌ సమర్పించి చాలా కాలమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ మార్చిలోనే ఆమోదం పొందనుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆదాయాలు ఇంకా పూర్తిగా గాడిన పడలేదని ప్రభుత్వం చెబుతోంది. కరోనా వల్ల కుంగిపోయిన ఆర్థిక పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయనీ ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్‌ స్వరూపంలో విస్తృతమైన మార్పులు ఉండకపోవచ్చని అంచనా. దాదాపు ప్రస్తుత బడ్జెట్‌ను కొంత పెంచి ప్రతిపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం బడ్జెట్‌ రూ.2.40 లక్షల కోట్ల నుంచి రూ.2.50 లక్షల కోట్ల మధ్యకే పరిమితం కావొచ్చని తెలుస్తోంది. దాదాపు మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి బడ్జెట్‌ స్వరూపంలో పెద్ద మార్పునకు అవకాశం ఉండటం లేదు. అంచనాలతో పోలిస్తే ఖర్చు కూడా 85% మేరే ఉంటోంది. కరోనా రెండు దశల్లోనూ రాష్ట్ర ఆదాయాలు బాగా తగ్గిపోవడంతో అంచనా మేరకు బడ్జెట్‌ ఖర్చులు ఉండట్లేదు. అదే సమయంలో రాష్ట్ర రుణాలూ ఎక్కువవుతున్నాయి. బడ్జెటేతర రుణాల మొత్తం పెరిగిపోతోంది. ఆ ప్రభావమూ రాష్ట్ర చెల్లింపుల ఖర్చును ప్రభావితం చేస్తోంది. కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకున్నా, వాటిని తీర్చే బాధ్యత ప్రభుత్వంపైనే పడుతోంది. వివిధ కార్పొరేషన్లకు గ్రాంట్ల రూపంలో నిధులు కేటాయించి అప్పులు తీర్చాల్సివస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలోనూ సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నవరత్నాలకే కేటాయింపులు సింహభాగం ఉండబోతున్నాయి. సంక్షేమ పింఛన్ల రూపంలో పెరిగే ఖర్చు, కొత్త పీఆర్సీ అమలు వల్ల అదనంగా భారమవుతున్న మొత్తాలు-జీతాలు, పింఛన్ల ఖర్చులు, వడ్డీ, అసలు చెల్లింపుల భారమూ పెరగనుంది. అన్ని ప్రభుత్వశాఖలూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపుల్లో సగం మేర కూడా ఖర్చు చేయలేకపోయాయి. ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులు ఏవీ ముందడుగు వేయలేదు. వీటిపై ముందడుగు ఎలా వేస్తారనేది చూడాల్సి ఉంది. చిన్నపిల్లల బడ్జెట్‌, మహిళల బడ్జెట్‌ కేటాయింపులు విడిగా చూపించేందుకు కసరత్తు సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details