వైఎస్సార్ చేయూత(YSR Cheyutha) లబ్ధిదారులకు రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని జగన్ సర్కార్ విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి 23,14,342 మంది ఖాతాల్లో రూ.4,339.39 కోట్లు జమ చేశారు. 45-60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మహిళలకు చేయూత పథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇస్తుంది.
'మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఆర్థిక సాయంతోపాటు జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి మహిళలకు వైఎస్సార్ చేయూత నిధులు అందిస్తాం. అర్హత ఉండి రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. కోటి జనాభాకు మంచి జరిగే గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నాం. మహిళల చేతుల్లో డబ్బు పెడితే మంచి జరుగుతుందని ఈ పథకాన్ని చేపట్టాం.' సీఎం జగన్
ఆరు లక్షలకు పైగా ఉన్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు వైఎస్సార్ చేయూత ఇస్తున్నామని సీఎం అన్నారు. వీరందరికీ సామాజిక పింఛన్ల ద్వారా లబ్ధి జరుగుతున్నా.. వైఎస్సార్ చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. వారి కాళ్లపై వారు నిలబడితే కుటుంబాలు బాగుంటాయని ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రెండేళ్లలోనే వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలకు దాదాపు రూ.9 వేలకోట్లు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. మహిళల్లో కొండంత ఆత్మవిశ్వాసం రావాలనే ఈ పథకం చేపట్టామని సీఎం జగన్ వివరించారు.
"అమూల్, రిలయన్స్ వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మహిళలతో వ్యాపారాలు పెట్టించి సంస్థల ద్వారా వస్తువులు తక్కువ ధరకే ఇస్తున్నాం. బ్యాంకుల ద్వారా మహిళలకు రూ.1,510 కోట్లు ఆర్థికసాయం అందించాం. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకుల ద్వారా అనుసంధానానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. 0866 2468899, 9392917899 నెంబర్లతో కాల్ సెంటర్‌ను ప్రారంభించాం. ఎవరికైనా సహాయం, సలహాలు, శిక్షణ కావాలంటే కాల్ సెంటర్‌కు చేయవచ్చు."-సీఎం జగన్
వైఎస్సార్ చేయూత నిధుల విడుదల ఇదీ చదవండి: