మొన్నటికి మొన్న.. వంట నూనెలు లీటరుకు రూ.70దాకా పెరిగాయి. పేద, మధ్య తరగతి జీవుల వంటింటి ఖర్చుకు మంట పెట్టాయి. ఈ భారం తట్టుకునేదెలా అని తల్లడిల్లుతుంటే... ఇంధన ధరల పిడుగు పడనే పడింది. మంగళవారం నుంచి లీటరు పెట్రోలు ధర 88 పైసలు, డీజిల్ 83 పైసలు చొప్పున పెరిగాయి. అంతలోనే వంట గ్యాస్ గంట కొట్టేసింది. నేనేం తక్కువ తిన్నానా అంటూ... సిలిండర్‌కు రూ.50 చొప్పున భగ్గుమంది. ఆస్తి, చెత్త పన్నుల బాదుడుతో ప్రభుత్వం కష్టజీవుల్ని పిండేస్తుండగా... ఇప్పుడేమో ఇంటింటికీ ఇంధన సెగ ఎక్కువవుతోంది. మార్చి ముగిసేలోగా ఇంకెన్ని బాదుడులు ఉంటాయో? ఇంటి ఖర్చు ఇంకెంత పెరుగుతుందో? అని పేద కుటుంబాలతో పాటు మధ్య తరగతివారు... చిరు వ్యాపారులు వాపోతున్నారు. తమకొచ్చే కొద్దిపాటి ఆదాయం ఈ ఖర్చులకే సరిపోతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. పెరిగిన ధరల నేపథ్యంలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలు చోట్ల గృహవినియోగ సిలిండర్ రూ.వెయ్యి దాటేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో డీజిల్ ధర రూ.100 పైగా చేరింది.
ధర పేలింది...
వంటగ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర విజయవాడలో సోమవారం దాకా రూ.922 ఉంది. దీనిపై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు మంగళవారం పేర్కొన్నాయి. ఫలితంగా సిలిండర్ ధర రూ.972కి చేరింది.
*వంటగ్యాస్ సిలిండర్ ధర చివరిగా గతేడాది అక్టోబరులో పెరిగింది. మళ్లీ ఇప్పుడు రూ.50 చొప్పున పెంచారు.
*రాష్ట్రంలో 1.43 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లున్నాయి. ప్రతినెలా గ్యాస్ తీసుకునే కుటుంబాలు 1.15 కోట్లుంటాయని అంచనా. పెరిగిన ధరల ప్రకారం చూస్తే... నెలకు రూ.57.50 కోట్ల భారం వినియోగదారులపై పడుతుంది.
*గతేడాది మార్చిలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.841. అప్పటి ధరతో పోలిస్తే.. సిలిండర్‌కు రూ.131 చొప్పున పెరిగింది.
*వంటగ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే రాయితీని ప్రభుత్వం క్రమంగా కుదించేసింది. 2020 మార్చిలో సిలిండర్ ధర రూ.833 ఉన్నప్పుడు.. రాయితీగా రూ.255 వినియోగదారుల ఖాతాల్లో జమ చేసింది. తర్వాత నుంచి క్రమంగా రాయితీకి కోత పెడుతూ వచ్చింది.
*ప్రస్తుతం సిలిండర్ ధర రూ.972 అయింది. రాయితీ రూపంలోఅందేది సగటునసిలిండర్‌కు రూ.15 మాత్రమే.
రూ.వెయ్యి దాటేసిన సిలిండర్
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో వంటగ్యాస్ కొనాలంటే రూ.వెయ్యి పైన పెట్టాల్సిందే. ఇంధన సంస్థలు ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచడంతో.. అక్కడ సిలిండర్ ధరలు రూ.1,019 వరకు చేరాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.1,019, ఎన్‌పీ కుంటలో రూ.1,016 ఉండగా.. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో రూ.1,008 చొప్పున ధర ఉంది. దూరానికి అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,165 అయింది.
దిల్లీలో రూ.949... వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరగడంతో... దిల్లీ, ముంబయిల్లో ధర వరుసగా రూ.949.50కు, కోల్‌కతాలో రూ.976కు చేరుకుంది. గత ఏడాది అక్టోబరు 6 తర్వాత దేశంలో వంటగ్యాస్ ధరలను సవరించడం ఇదే తొలిసారి. 2021 జులై, 2021 అక్టోబరు మధ్య ఒక్కో సిలిండర్ ధర రూ.100 మేర పెరిగింది. అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో రేట్ల నెలవారీ సవరణ నిలిచిపోయింది. 2014 జనవరిలో సిలిండర్ ధర అత్యధికంగా రూ.1,241కి చేరుకుంది. అప్పట్లో కేంద్రం ప్రభుత్వం ఒక్కో గ్యాస్‌బండపై రూ.600 వరకు సబ్సిడీ అందించేది. 2020 మే నుంచి దాన్ని నిలిపివేసింది. రవాణా ఛార్జీల భారాన్ని తగ్గించేలా స్వల్ప మొత్తాన్ని వినియోగదారులకు అందిస్తోంది. తాజా పెంపుతో 19 కేజీల వాణిజ్య వినియోగ సిలిండర్ ధర రూ.2,003.50కు చేరుకుంది.