హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాకు వెళ్లే 163వ జాతీయ రహదారి నిత్యం రక్తమోడుతోంది. రద్దీకి అనుగుణంగా విస్తరణ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రమాదకర మలుపులతో ప్రతిరోజు ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు 48 కిలోమీటర్ల దూరం ఏకంగా 49 మలుపులున్నాయి. ప్రతి కిలోమీటరుకు రహదారి వంకర్లు తిరగడం, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఈ మార్గంలో వారానికి సగటున 8-9 ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారులపై వాహనాల సగటు వేగం 80 కిలోమీటర్లు కాగా, ఈ రహదారిలో 40.కి.మీ.గానే ఉండటం దయనీయ పరిస్థితికి నిదర్శనం.
ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు
2016లో కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. రూ.740 కోట్లతో ఈ రహదారిని 60 మీటర్ల మేర విస్తరించాలని జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ప్రతిపాదించారు. భూసేకరణకు మార్కింగ్ కూడా ఇచ్చారు. రహదారి నిర్మాణం, నిర్వహణ విషయంలో ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య పేచీ కారణంగా పనులు ముందుకుసాగలేదు. ఈలోపు నిధులు వెనక్కి మళ్లిపోయాయి. తిరిగి ఏడాదిన్నర కిందట రహదారి నిర్మాణ బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐ తీసుకుంది. ఐదునెలల కిందట రహదారి విస్తరణకు కేంద్రం సుముఖత తెలిపింది. గతంలో ప్రతిపాదించిన 60 మీటర్ల వెడల్పును 45 మీటర్లకు కుదించింది. అందుకు అనుగుణంగా అంచనాలు తగ్గించి భూసేకరణకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధంచేయాల్సి ఉండగా, ఈ ప్రక్రియలోనూ తీవ్రజాప్యం జరుగుతోంది. భూసేకరణ పూర్తిచేసి, పరిహారం చెల్లించి, టెండర్లు పిలిచి పనులు పూర్తిచేసేసరికి ఇంకెన్నేళ్లు పడుతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇది ఓ తల్లి గర్భశోకం
కుమారుడి ఫొటో వద్ద ఏడుస్తున్న ఈమె పేరు అనిత. చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల గ్రామానికి చెందిన సునీల్ ప్రైవేటు ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. డిసెంబరులో విధులు ముగించుకుని ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. కొడుకు మరణంతో కుటుంబం వీధినపడిందని, తన భర్త సంజీవయ్య వృద్ధాప్యంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె కన్నీటిపర్యంతమవుతోంది. కిలోమీటరుకో మలుపుతో అత్యంత భయానకంగా, ప్రమాదాలకు నిలయంగా మారిన 163 నంబరు జాతీయ రహదారి ఇలాంటి ఎందరో తల్లులకు కడుపుకోత మిగిల్చింది. ఎందరో బిడ్డలకు కన్నవాళ్లను దూరంచేసింది.
ఇదీ చదవండి: