2020 ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 15.15 లక్షల మంది రైతన్నలకు రూ.1,820.23 కోట్ల బీమా పరిహారాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. అనంతరం అన్ని జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
62 శాతం మందికి ఉపాధి..
62 శాతం ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై జీవనం సాగిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. వ్యవసాయం ఆహార భద్రత ఇవ్వడమే కాకుండా 62 శాతం మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. రైతులు, రైతుకూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. వీరి బాగోగుల కోసం గట్టిగా అడుగులు వేస్తున్నామని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులందరికీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద పరిహారం అందిస్తున్నామని చెప్పారు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా... పారదర్శకంగా పరిహారం పంపిణీ చేస్తున్నామని, జాబితాను అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నట్లు సీఎం తెలిపారు.
పేరుకే పరిహారం ఫథకాలు ఉండేవి..
పంట నష్టానికి సంబంధించి 2018-19 ఏడాది రూ. 715కోట్లు, 19-20 ఏడాదికి రూ.1252 కోట్ల బకాయిలు వైకాపా ప్రభుత్వం రైతులకు చెల్లించిందని సీఎం వివరించారు. ఇప్పటి వరకు రూ.1968 కోట్ల బీమాను రైతులకు అందించామని, ఇవాళ్టి చెల్లింపులు రూ.1820 కోట్లు కలిపితే రూ.3788 కోట్లను రైతులకు పంట నష్టానికి బీమాగా చెల్లించినట్ల వివరించారు. గతంలో పేరుకే పరిహారం ఫథకాలు ఉండేవని, ఎప్పుడు, ఎవరికి ఎంత ఇస్తారో తెలిసేవి కాదని, ఇన్పుట్ సబ్సిడీ వెంటనే అందేది కాదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ సీజన్లో నష్టం వస్తే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
నేరుగా రైతులకే...
2020లో పంట నష్టపోతే రూ.930 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద నేరుగా రైతులకు సీజన్ ముగిసేలోపే ఇచ్చామని సీఎం వెల్లడించారు. బీమా కోసం గతంలో రైతులు ఒక భాగం, రాష్ట్రం ఒక భాగం, కేంద్రం మరో భాగం చెల్లించేదని, ఎవరు ప్రీమియం చెల్లించకపోయినా అంతిమంగా రైతులే నష్టపోయేవారని వ్యాఖ్యానించారు. ఈ విధానంలో రైతులకు నష్టం జరుగుతుందని భావించి, రైతులపై భారం లేకుండా ప్రభుత్వమే బీమా మొత్తం భరిస్తోందని సీఎం వివరించారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరా పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 23 నెలల కాలంలో అక్షరాలా రైతుల కోసం రూ.83 వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వివరించారు.
ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయం...