ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 4, 2020, 8:48 AM IST

ETV Bharat / city

మండలిలో వీగిపోయిన వ్యాట్‌ సవరణ, వృత్తి పన్ను విధింపు బిల్లులు

శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వానికి మరో మారు ఎదురుదెబ్బ తగిలింది. ఒకే రోజు ఏకంగా నాలుగు బిల్లులను మండలి తిరస్కరించినట్టు పీటీఐ కథనం వెల్లడించింది. వీటిలో మూడింటిపై ఓటింగ్‌ నిర్వహించగా వీగిపోయాయి. మరో బిల్లును తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం రూలింగ్‌ ఇచ్చారు.

deputy chairman reddy subramaniyam
డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం

శాసన మండలిలో మొత్తం 8 బిల్లుల్ని ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టినట్టు పీటీఐ కథనం తెలిపింది. కథనంలోని వివరాల ప్రకారం.. వీగిపోయిన వాటిల్లో పెట్రోలు, డీజిల్‌పై రోడ్డు అభివృద్ధి పన్ను విధింపునకు సంబంధించిన రెండో సవరణ బిల్లు.. పెట్రోలు, డీజిల్‌పై రోడ్డు అభివృద్ధి పన్ను విధింపునకు సంబంధించి ఏపీ వ్యాట్‌ మూడో సవరణ బిల్లు.. ఆంధ్రప్రదేశ్‌ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను పెంపునకు సంబంధించిన సవరణ బిల్లులున్నాయి. ఈ బిల్లుల వల్ల ప్రజలపై రూ.వేల కోట్ల ఆర్థిక భారం పడుతుందని తెదేపా సభ్యులు ధ్వజమెత్తారు. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ మండలిలో ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు డివిజన్‌కు పట్టుబట్టారు.

వీటిపై ఓటింగ్‌ నిర్వహించగా ఆ బిల్లులు వీగిపోయాయి. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి విలువపై పన్ను విధింపునకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ పురపాలక చట్టాల (రెండో సవరణ) బిల్లుపై బుధవారమే ఓటింగ్‌ నిర్వహించి శాసనమండలి తిరస్కరించింది. గురువారం ఉదయం దాన్ని శాసనసభలో మరోమారు ఆమోదింపజేసుకుని సాయంత్రం మండలిలో మంత్రి బొత్స ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఆ బిల్లు వీగినందున రెండోసారి కూడా దాన్ని తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ సభలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల (బదిలీ నిషేధ) (సవరణ) బిల్లు, పశువుల మేత తయారీ (నాణ్యత, నియంత్రణ) బిల్లు, వ్యవసాయ భూములు (వ్యవసాయేతర అవసరాల కోసం మార్పిడి) బిల్లు, రాష్ట్ర వ్యవసాయ మండలి బిల్లులు మాత్రం సభలో ఆమోదం పొందాయి.

వీగిపోయిన బిల్లులివే..

* పెట్రోల్‌, డీజిల్‌పై రోడ్డు అభివృద్ధి పన్ను విధింపునకు సంబంధించిన ఏపీ వ్యాట్‌ (2,3వ సవరణలు)కు సంబంధించిన రెండు బిల్లులు: ఈ రెండు బిల్లులపై వేర్వేరుగా ఓటింగ్‌ నిర్వహించారు. తెదేపాకు చెందిన 24 మంది సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. వైకాపాకు చెందిన 8 మంది బిల్లుకు మద్దతిచ్చారు. పీడీఎఫ్‌ సభ్యులు నలుగురు తటస్థంగా ఉన్నారు. భాజపా సభ్యులు పీవీఎన్‌ మాధవ్‌, వాకాటి నారాయణరెడ్డిలు వాకౌట్‌ చేశారు. ఈ 2బిల్లులు వీగినట్లు మండలి ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ ప్రకటించారు. బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు పీడీఎఫ్‌ సభ్యుడు వెంకటేశ్వరరావు సభలో ప్రకటించినప్పటికీ ఓటింగ్‌లో తటస్థంగా ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌ వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలపై పన్ను పెంపునకు సంబంధించిన సవరణ బిల్లు: తెదేపాకు చెందిన 25 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. వైకాపాకు చెందిన 9మంది మద్దతు పలికారు. పీడీఎఫ్‌ సభ్యులు సహా మొత్తం ఐదుగురు తటస్థంగా నిలిచారు.

ఇదీ చదవండి:

కౌలు రైతుల కోసం జై కిసాన్ : పవన్

ABOUT THE AUTHOR

...view details