దివంగత ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్‌తో ఎప్పటినుంచో ప్రత్యేక అనుబంధం ఉంది. తమకు తెలియని విషయాలు సైతం ఆయన ఎంతో ఆశ్చర్యానికి గురిచేసేవారని అప్పటి కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషపైనా ఎంతో అభిమానం, గౌరవం ఉండేవన్నారు. రాష్ట్రపతి హోదాలో 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర విభజన ఉద్యమంలోనూ అన్ని విషయాలు ప్రణబ్‌తోనే పంచుకునే వాళ్లమని మాజీమంత్రి గాదె వెంకట్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికలోనూ....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికలోనూ.... ప్రణబ్ క్రియాశీలకంగా వ్యవహరించారు. 2010 నవంబర్ 24న హైదరాబాద్‌కు వచ్చిన ప్రణబ్.... సీఎం పదవికి పోటీ పడుతున్న సీనియర్లను ఒప్పించి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేశారు. ప్రణబ్ ముఖర్జీ సమైక్యవాదని...రాష్ట్ర విభజన ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. అయితే రాష్ట్రపతి హోదాలో తప్పక ఆయన విభజన చట్టంపై సంతకం చేయాల్సి వచ్చిందన్నారు.