ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 31, 2020, 7:11 AM IST

ETV Bharat / city

'పస్తులుండే స్థాయి నుంచి శాస్త్రవేత్తగా ఎదిగా'

పేదరికమే తనను శాస్త్రవేత్తగా మార్చిందని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్​డీసీ) మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం అన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఐపీఆర్ ఛైర్‌ ఆచార్యుడిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ ఆయన్ను నియమించింది. ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘ఈనాడు ఈటీవీ భారత్​తో’ ప్రత్యేకంగా మాట్లాడారు.

former national research development center  director hanumanthu purushottam
డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం

పేదరికం.. దాని అనుభవాలే తనను శాస్త్రవేత్తను చేశాయని జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్‌డీసీ) మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఆయన్ను.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఐపీఆర్ ఛైర్‌ ఆచార్యుడిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ ఆయన్ను నియమించింది. తినడానికి తిండి లేని స్థానం నుంచి శాస్త్రవేత్తగా ఎదిగిన విషయాలను ఆయన ఈనాడు - ఈటీవీతో పంచుకున్నారు.

పస్తులతో పడుకునే వాళ్లం..

నాది శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బెండి గ్రామం. నా తండ్రి హనుమంతు వెంకయ్య, తల్లి అన్నమ్మలకు మేము ఇద్దరు పిల్లలం. పేరుకు వారసత్వంగా వచ్చిన నాలుగెకరాలున్నప్పటికీ అందులో పంటలు పడేవి కావు. పూర్తిగా వర్షాధారం కావడంతో ఎప్పుడన్నా పంటలు పండినా భారీవర్షాలకు అంతా నాశనం అయ్యేది. దీంతో తీవ్రమైన పేదరికంతో ఇబ్బంది పడేవాళ్లం. తినడానికి తిండి కూడా ఉండేదికాదు. పస్తులతో పడుకున్న రోజులెన్నో ఉన్నాయి. బాగా చదువుకుంటే కష్టాలు తీరతాయని నా తల్లి చెబితే బాగా చదువుకోవాలన్న కోరిక నా మనసులో బలంగా నాటుకుంది. దీంతో చిన్ననాటి నుంచే పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాల్ని బాగా చదివేవాడిని.

కూలీకి వెళ్లి కుటుంబానికి అండగా ఉన్నా..

డబ్బులేక తీవ్రమైన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేను ఐదో తరగతి నుంచే కూలీకి వెళ్లేవాడిని. మా ప్రాంతంలో అప్పట్లో ఉప్పును పెద్దఎత్తున తయారుచేసేవారు. ఉప్పు గంపలు మోయడానికి వారికి కూలీలు అవసరం. దీంతో నేను ఉప్పు గంపలు మోసే కూలీగా మారాను. చిన్నవయస్సు కావడంతో వాటిని మోయడం చాలా కష్టంగా అనిపించేది. తీవ్రమైన ఒళ్లునొప్పులతో ఏడ్చేసేవాడిని. అదే సమయంలో ఆ పరిస్థితికి కారణమైన పేదరికం నుంచి బయటపడాలన్న కోరిక కూడా నాలో బలంగా నాటుకుంది. ఆరోజు నేను ఆ కష్టాలు పడకపోయి ఉంటే నేను సరిగ్గా చదువుకుని ఉండేవాడిని కాదేమోనని ఇప్పటికీ అనుకుంటా.

మిలటరీలోకి వెళ్లిపోవాలనుకున్నా..

బాగా చదువుకోవాలన్న తపన ఉన్నా ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా డబ్బు సంపాదించడం అనివార్యంగా మారింది. దీంతో మిలటరీలోకి వెళ్లడానికి కూడా ప్రయత్నించా. ఒకసారి సిపాయిల ఎంపికలు జరుగుతున్నాయని తెలిసి పలాస వెళ్లా. ఎత్తు, బరువు, శరీరాకృతి తదితరాలు పరీక్షించిన తరువాతే పరుగు, ఇతర పరీక్షలకు పంపేవారు. నన్ను చూసి ప్రాథమిక దశలోనే అనర్హత వేటు వేశారు. ఎందుకని అడిగితే కాళ్లు సరిగా లేవని, మిలటరీకి పనికిరానని తేల్చేశారు. దీంతో బాగా చదువుకుని, ఉద్యోగం సంపాదించుకుంటేగానీ జీవితంలో మంచిగా స్థిరపడలేనని అర్థమయింది.

ఏడో తరగతిలోనే పెళ్లి చేశారు..

నా సొంత మేనమామ చింతాడ రామస్వామి పోస్ట్‌మాస్టర్‌గా కణితివూరు అనే గ్రామంలో విధులు నిర్వర్తించేవారు. ఆయన ఆర్థికంగా ఒకింత మెరుగైన స్థితిలో ఉండడంతో నా తల్లి ఆయన కుమార్తె మహాలక్ష్మితో నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడే వివాహం చేశారు. నా చదువుకు ఆయన ఉపయోగపడతారని ఆమె ఆలోచన. వివాహం అయిన తరువాత మేనమామ ఇంట్లోనే ఉండి నేను చదువుకున్నాను. ఆయన నన్ను బాగా చదివించారు. పదోతరగతి వరకు ఇద్దరం కలిసే పాఠశాలకు వెళ్లి చదువుకునేవాళ్లం.

శాస్త్రవేత్తవి ఐతే ఏంచేస్తావు..

నేను పదోతరగతి వరకు పూండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. పదోతరగతి చదువుకునే రోజుల్లో ‘శాస్త్రవేత్తవి ఐతే ఏంచేస్తావు...’ అనే అంశంపై పోటీ పెట్టారు. దీంతో మా గ్రామంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, ఉపయోగించాల్సిన పరిజ్ఞానాలపై వ్యాసం రాశాను. ఆ వ్యాసానికి నాకు బహుమతి రావడంతో నేను శాస్త్రవేత్తను కావాలన్న కోరిక బలపడింది.

ఆంధ్రవిశ్వవిద్యాలయంలో సీటు రావడం కీలకమలుపు..

ఇంటర్‌ అనంతరం నాకు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో సీటు రావడం నా జీవితంలో కీలక మలుపనే చెప్పాలి. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్‌. పూర్తిచేశాను. ఆ తరువాత సి.ఎస్‌.ఐ.ఆర్‌.(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌) సంస్థలో శాస్త్రవేత్తగా ఉద్యోగం రావడంతో నా కల ఫలించినట్లైంది. ఆ తరువాత ఉద్యోగం చేసుకుంటూనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కూడా పూర్తిచేశాను. నా చదువుకు నా మేనమామే పూర్తిగా సహకరించారు.

అసోంలో ఉద్యోగం..

ఉద్యోగం వచ్చిన తరువాత అసోంలోని జోర్హాట్‌లో ఉన్న ప్రాంతీయ పరిశోధనశాల శాస్త్రవేత్తగా నన్ను నియమించారు. అక్కడ బొగ్గు గనులు భారీగా ఉన్నప్పటికీ అందులో సల్ఫర్‌శాతం అధికంగా ఉండడంతో ఆ బొగ్గును ఎవరూ వినియోగించేవారు కాదు. అందులోని సల్ఫర్‌ కారణంగా ఆ బొగ్గు విలువ కోల్పోతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రక్రియలు నిర్వహిస్తే ఆ బొగ్గును పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చన్న అంశంపై ఇతర శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేశాను. ‘ప్లూయిడైజ్డ్‌ బెడ్‌ కంబషన్‌ ఆఫ్‌ హై సల్ఫర్‌ కోల్‌’ ప్రక్రియను ఆవిష్కరించాం.

పరిశోధనశాలల్లోనే జీవితం..

అసోం తరువాత దిల్లీలోని సిమెంటు పరిశోధన కేంద్రంలోనూ, చెన్నైలోని కేంద్ర తోలు పరిశోధన కేంద్రంలోనూ చేశాను. తోలు పరిశ్రమల రంగం ఆధునికీకరణకు, కాలుష్య తగ్గింపునకు అవసరమైన పరిజ్ఞానాలను అభివృద్ధి చేశాం. నేను వ్యక్తిగతంగా మూడు మేధోసంపత్తి హక్కులు సాధించినప్పుటికీ పరిశోధన కేంద్రల్లో సుమారు 300 మేధోసంపత్తి హక్కులు పలువురు శాస్త్రవేత్తలకు, పరిశోధన సంస్థలకు దక్కడానికి నావంతు సాయం చేశాను. శాస్త్రవేత్తగా భారత ప్రభుత్వం తరుపున 22 దేశాలు తిరిగాను. వివిధ అంశాలపై వంద పరిశోధన పత్రాలు రాశాను. 1991లో ‘యంగ్‌ కన్సల్టెంట్‌ అవార్డు’, 2017లో ‘సీఈవో ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును సాధించాను. నష్టాల్లో ఉన్న ఎన్‌.ఆర్‌.డి.సి.ని లాభాల బాటలో పయనించేలా చేశా.

ఎన్‌ఆర్‌డీసీ ఛైర్మన్‌గా..

జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఆరు సంవత్సరాలు విధులు నిర్వర్తించాను. సుమారు 200 రకాల సాంకేతిక పరిజ్ఞానాలను ఉత్పత్తులుగా మార్చడానికి వీలుగా చర్యలు తీసుకున్నా. ఐక్యరాజసమితి సౌజన్యంతో విశాఖలో ‘టెక్నాలజీ ఇన్నొవేషన్‌ సపోర్ట్‌ కేంద్రం’, ఎన్‌.ఆర్‌.డి.సి. ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకావడానికి కృషిచేశాను. హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీలోని పలు బయోటెక్నాలజీ సంస్థలకు సుమారు రూ.300 కోట్లు కేటాయించడంతో ఆయా సంస్థలు నేడు విశేష ప్రగతిని సాధించాయి. నా 37 సంవత్సరాల సర్వీసులో 351 ఆవిష్కరణలను వాణిజ్య ప్రాతిపదికపై ఉత్పత్తి జరిగేలా కృషిచేశా. ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి వర్సిటీలో ఐ.పి.ఆర్‌.ఛైర్‌ ఏర్పాటుచేసి నేను ఏయూలో నియామకం పొందడానికి కృషిచేశారు. చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే మళ్లీ నియామకం పొందడం ఆనందంగా ఉంది.

ఇదీ చదవండి:

మేయర్​గా ఎన్నికైన 21 ఏళ్ల ఆర్య

ABOUT THE AUTHOR

...view details