ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ మంత్రి నారాయణపై.. చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు

Narayana case
మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

By

Published : May 26, 2022, 3:50 PM IST

Updated : May 26, 2022, 5:13 PM IST

15:47 May 26

మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన న్యాయస్థానం

మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. నారాయణపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రింగ్‌ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు.. సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ కేసును సవాల్ చేస్తూ.. మాజీ మంత్రి నారాయణతోపాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది.

నేపథ్యమిదే.. : అమరావతి బృహత్‌ ప్రణాళిక డిజైనింగ్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, దానిని అనుసంధానించే రహదారుల అలైన్‌మెంట్‌ విషయమై అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నాయని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. ఐపీసీ 120(బి), 420, 34,35,36,37,166, 167, 217, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2)రెడ్‌విత్‌ 13(1)(ఎ) సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణ, మరికొందరిని నిందితులుగా పేర్కొన్న విషయం విదితమే.అనుమానం, ఊహాజనిత కారణాలతో చేసిన ఫిర్యాదు ఇది.. : ‘అమరావతి కోసం తలపెట్టిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును 2019లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. 2020 నుంచే అమరావతి బృహత్తర ప్రణాళికను బుట్టదాఖలు చేసింది. ఒక్క అంగుళం భూసేకరణ జరగలేదు. అలాంటప్పుడు ఈ వ్యవహారంలో కొందరికి అనుచిత ప్రయోజనం కల్పించారనే ప్రశ్న తలెత్తదు. వేధించడం కోసం, గౌరవ మర్యాదలు, ప్రతిష్ఠను దిగజార్చాలని వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నాపై ఫిర్యాదు చేశారు. ఓ హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో సంబంధాలున్నాయని ఆరోపణ చేశారు. నాకు, కుటుంబ సభ్యులకు ఆ హౌసింగ్‌ సంస్థతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. అనుమానం, ఊహాజనిత కారణాలతో చేసిన ఫిర్యాదు ఇది. మాస్టర్‌ ప్లాను సిద్ధం చేసే పనిని సీఆర్‌డీఏ 2015 ఆగస్టులో సింగపూర్‌కు చెందిన సుర్బానా- జురాంగ్‌ సంస్థకు అప్పగించింది. దీనిపై ఫిర్యాదుదారు ఇప్పుడు ఫిర్యాదు చేశారు. సుమారు 6 ఏళ్ల 8 నెలల అసాధారణ జాప్యం ఉంది. ఫిర్యాదులో జాప్యానికి కారణం ఏమిటో చెప్పకుండా మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఏ ఒక్కరికీ ఈ విషయంలో దురుద్దేశాలు ఆపాదించడానికి వీల్లేదు. నేరపూర్వక బాధ్యులుగా పేర్కొనడం సరికాదు.

రాజధాని వ్యవహారంలో సీఆర్‌డీఏ చట్టం నిబంధనల మేరకు సమష్టిగా తీసుకున్న నిర్ణయాలు, చర్యలకు ప్రభుత్వానికి, అధికారులకు ఆ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ ఉంది. విచారించడానికి వీలు లేకుండా నిషేధం ఉంది. ఐపీసీ సెక్షన్‌ 420 కింద నాపై కేసు నమోదు చెల్లుబాటు కాదు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారు ఏ ఒక్కరినైనా మోసగించడానికి ప్రయత్నించారని ఫిర్యాదుదారుడు పేర్కొనలేదు. ప్రాపర్టీ స్వాధీనం చేసుకోనప్పుడు మోసపూరితంగా పరిగణించలేమని న్యాయ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిందితులు చట్ట విరుద్ధమైన ప్రతిఫలం పొందారని ఫిర్యాదుదారుడు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చెల్లదు. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు నిర్దిష్టమైనవి కావు. అపఖ్యాతి పాల్జేయాలని దురుద్దేశంతో నిందారోపణలు చేస్తున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయండి...’ అని మాజీ మంత్రి నారాయణ కోరారు.


ఇవీ చదవండి:

Last Updated : May 26, 2022, 5:13 PM IST

ABOUT THE AUTHOR

...view details