ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ మంత్రి నారాయణ అరెస్టు !

narayana arrest
ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ

By

Published : May 10, 2022, 11:37 AM IST

Updated : May 11, 2022, 4:30 AM IST

11:35 May 10

నారాయణను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు

మాజీ మంత్రి నారాయణను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్‌ అభియోగాలపై నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్‌ చేసిన మాజీ మంత్రి నారాయణను..పోలీసులు చిత్తూరులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. గతరాత్రి పొద్దుపోయాక చిత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి నివాసంలో నారాయణను...హాజరుపరిచారు.

మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ పోలీసులు నాటకీయ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నారు. వేర్వేరు వాహనాల్లోకి మారుస్తూ తెలంగాణ సరిహద్దులు దాటించి చిత్తూరుకు తరలించారు. ఏపీ పోలీసులు మంగళవారం 3 బృందాలుగా హైదరాబాద్‌ చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే నార్సింగి, కేపీహెచ్‌బీ కాలనీ, కొండాపూర్‌ ప్రాంతాల్లోని నారాయణ నివాసాల వద్ద మాటు వేశారు. ఉదయం 10.30-11 గంటల సమయంలో కొండాపూర్‌ నివాసం నుంచి నారాయణ దంపతులు కారులో బయటకు వచ్చారు. మాదాపూర్‌ ఐకియా కూడలి వద్దకు రాగానే మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయన భార్యను కిందకు దింపి, అదే కారులో వేగంగా వెళ్లిపోయారు. తనను కిడ్నాప్‌ చేస్తున్నారంటూ కారులో నుంచే నారాయణ కేకలు వేసినట్టు తెలిసింది. ఈ హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన ఆయన భార్య, అనుచరులు డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన వారు ఆ కారును అనుసరించారు. మధ్యాహ్నం 12.30కు కర్నూలు జాతీయ రహదారి కొత్తూరు జేపీ దర్గా వద్దకు చేరిన కారును కొత్తూరు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు బృందం నిలిపింది.

వాహనంలో ఉన్న ఏపీ పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టు చేసేందుకు నారాయణను తీసుకువెళుతున్నట్లు ఆధారాలు చూపారు. దీంతో తెలంగాణ పోలీసులు ఆయనను తీసుకువెళ్లడానికి అంగీకరించారు. అక్కడే ఏపీ పోలీసులు నారాయణను మరో వాహనంలో ఎక్కించుకొని వెళ్లిపోయారు. తొలుత నారాయణ కిడ్నాప్‌ అయినట్లు భావించి ఆందోళనకుగురై రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భార్య రమాదేవి సిద్ధమయ్యారని మాదాపూర్‌ డీసీపీ కె.శిల్పవల్లి ‘ఈనాడు’కు తెలిపారు. అరెస్టు చేసినట్లు తెలుసుకుని ఫిర్యాదు చేయకుండా ఆగిపోయినట్లు చెప్పారు. నారాయణను ప్రైవేటు వాహనంలో తీసుకెళ్తున్నారని తనకు మాదాపూర్‌ పోలీసులు కారు నంబరు పంపినట్లు కొత్తూరు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజ్‌ తెలిపారు. ఆ సమాచారంతోనే కారు ఆపామన్నారు.

కుమారుడి వర్ధంతి అన్నా వినలేదు
మాజీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్‌ నారాయణ 2017 మే 10న ప్రమాదంలో మరణించారు. మంగళవారం తనయుడి వర్ధంతి కోసం నారాయణ దంపతులు బయల్దేరినట్టు సమాచారం. క్రతువు పూర్తి చేయకుండానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్ధంతి కార్యక్రమం పూర్తి చేశాక అదుపులోకి తీసుకోవాలని నారాయణ కోరినా పోలీసులు అందుకు అంగీకరించలేదని సమాచారం. సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ఆయన ఉన్న ప్రదేశాన్ని గుర్తించి.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న నారాయణ తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేశారని తెలంగాణ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరో నంబరు వాడుతున్నట్లు సమాచారం. ఈ నంబరునూ ఏపీ పోలీసులు తెలుసుకుని లొకేషన్‌ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.

కళ్లు గప్పి.. దారి మళ్లించి..
మాజీ మంత్రి నారాయణను చిత్తూరు తరలించే విషయంలో పోలీసులు అందరి కళ్లుగప్పి దారి మళ్లించారు. తెలంగాణలోని గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా మీదుగా నారాయణను తీసుకెళ్తారని అందరూ అక్కడే గంటలపాటు నిరీక్షించారు. కర్నూలు పోలీసులు తెలంగాణలోని అలంపూర్‌ చౌరస్తా నుంచి రాజోలి మీదుగా గూడూరు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కర్నూలు మీదుగా ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం వరకు వెళ్లి అక్కడ సిద్ధంగా ఉన్న చిత్తూరు పోలీసులకు అప్పగించారు.

కుట్రపూరిత విధానాలు మానుకోవాలి

వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెదేపా ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టుతో కొత్త డ్రామాకు తెరలేపారని, జగన్‌ పాలనను భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. నారాయణ అరెస్టుకు నిరసనగా మంగళవారం నెల్లూరులో తెదేపా నేతలు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డి, తాళ్లపాక అనురాధ తదితర నాయకులు, కార్యకర్తలు నెల్లూరులో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. వైకాపా ప్రభుత్వం కక్షపూరిత విధానాలను మానుకోవాలని తెదేపా నేతలు డిమాండు చేశారు. ఎక్కడో ప్రశ్నపత్రాలు లీకైతే ఆ సాకుతో నారాయణ కుటుంబాన్ని కుమారుడి వర్ధంతి సమయంలో అరెస్టు చేయడం కక్షసాధింపు చర్యకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఎలైన్‌మెంట్‌లో అక్రమాలంటూ కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ఇక రాజధాని మార్చేసిన జగన్‌మోహన్‌రెడ్డిని ఏం చేయాలని పలువురు ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : May 11, 2022, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details