కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఏ నేరానికీ పాల్పడలేదని, అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు, పోలీసులు కలిసి కుట్రపన్ని తనను, మరికొందరిని తప్పుడు కేసులో ఇరికించారని చెప్పారు.
‘కొండపల్లి అభయారణ్యం ప్రాంతంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో వృక్షజాతులు, ముఖ్యంగా కొండపల్లి బొమ్మల తయారీకి వినియోగించే ‘తెల్ల పొనికి’ కలపకు ఏ మేరకు నష్టం జరుగుతుందో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన నాకు తెలుసు. అధికార పార్టీ వ్యక్తుల సహకారంతో ఈ అక్రమ తవ్వకాలు జరగుతున్నాయి. దీని జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు బెదిరించారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలను నిలువరించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జులై 27న కొండపల్లిలో పార్టీ సమావేశానికి హాజరయ్యాను. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు సాయంత్రం 4గంటలకు మరికొందరితో కలిసి నేను అడవిలోకి వెళ్లి అక్రమ తవ్వకాల్ని పరిశీలించాను. వాటిని రికార్డు కూడా చేశాం. సాయంత్రం 5.45 గంటల సమయంలో మీడియాతో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యా. ఈ విషయం తెలిసి అధికారపార్టీకి చెందిన పలువురు, అక్రమ మైనింగ్‌తో సంబంధం ఉన్న కొందరు.. రహదారులను దిగ్బంధించి నాపై దాడి చేశారు. కారును ధ్వంసం చేశారు. పోలీసులు, మీడియా వారి సమక్షంలోనే ఈ దాడి జరిగింది. తర్వాత నేను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా కనీసం కారులో నుంచి బయటకు రానీయలేదు. దాసరి సురేశ్ అనే వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో నాపై మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు’ అని ఉమా పిటిషన్‌లో పేర్కొన్నారు.
మేమే బాధితులం