ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ పోలీస్​కు అంతర్గత సహకారం.. ప్రాణహాని ఉందంటూ బాధితుల ఆందోళన - Former Inspector Nageswara Rao

CI Nageswararao: వివాహితపై రివాల్వర్ గురిపెట్టి అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న మారేడ్​పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుకు పోలీసులు అంతర్గతంగా సహకరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే నిందితుడు రెండు రోజుల పాటు పరారీలో ఉన్నట్లు చూపారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఫిర్యాదు చేసే సమయంలో ధైర్యంగా ఉన్నామని, ప్రస్తుతం నాగేశ్వరరావుకు ఉన్నత స్థాయిలో సహకారం ఉన్నట్లు తెలియడంతో భయమేస్తుందని బాధితురాలి భర్త ఆవేదన వెలిబుచ్చారు. తమకు ప్రాణహాని ఉందంటూ వాపోయారు.

CI Nageswararao
CI Nageswararao

By

Published : Jul 12, 2022, 12:36 PM IST


CI Nageswararao:అత్యాచారయత్నం.. అత్యాచార కేసుల్లో నిందితులైన వారిని పట్టుకుంటే చాలు.. ప్రత్యక్ష ప్రసారాలు.. విలేకరుల సమావేశాలు నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించే పోలీస్‌ అధికారులు మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావుకు అంతర్గతంగా సహకరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 7న జరిగిన ఘటనపై తెలంగాణలోని వనస్థలిపురం పోలీసులు 9న కేసు నమోదు చేశారు. రెండ్రోజుల పాటు నిందితుడు పరారీలో ఉన్నట్లు చూపారు. ఆదివారం రాత్రి రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. బాధితురాలు, ఆమె భర్తతో కొందరు మాట్లాడి రాజీ చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నందుకే రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ వ్యవహారాన్ని సాగదీశారని తెలిసింది. మరోవైపు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా నాగేశ్వరరావు చేసిన తప్పిదాలు, బంజారాహిల్స్‌ ఠాణాలో బాధ్యతలు చేపట్టాక చేసిన పంచాయితీలు వెలుగు చూస్తున్నాయి.

రాయదుర్గంలో ఓ మహిళ నిస్సహాయతను ఆసరా చేసుకొని లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులూ ఆయన వ్యవహారశైలిపై తమ అనుభవాలను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా వివాహితపై సర్వీస్‌ రివాల్వర్‌ గురిపెట్టి అత్యాచారానికి పాల్పడటంపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఫిర్యాదు చేసే సమయంలో ధైర్యంగా ఉన్నామని, ప్రస్తుతం ఆయనకు ఉన్నత స్థాయిలో సహకారం ఉన్నట్లు తెలియడంతో భయమేస్తుందని బాధితురాలి భర్త ఆవేదన వెలిబుచ్చారు. తమకు ప్రాణహాని ఉందంటూ వాపోయారు.

ప్రజాప్రతినిధుల జోక్యం..
బాధితులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని బాధితులకు పరోక్షంగా అండగా నిలిచినట్లు సమాచారం. గతంలో ఆ ఇన్‌స్పెక్టర్‌ వల్ల ఇబ్బంది పడిన ఆ ఇద్దరు నేతలు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనంటూ కొట్టిపారేస్తున్నారు. తాము నిష్పక్షపాతంగా బాధితురాలి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేస్తున్నారు. ఇంకా బాధితులు బయటకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసేందుకు సిద్ధమంటున్నారు.

సీఐ నాగేశ్వరరావు అరెస్ట్‌.. రిమాండ్‌కు తరలింపు!

‘అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావును ఆదివారం వనస్థలిపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని సోమవారం హయత్‌నగర్‌ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారని’ రాచకొండ సీపీ మహేశ్​ భగవత్‌ తెలిపారు. రాత్రి సమయం కావడంతో నిందితుడిని ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ కార్యాలయంలో ఉంచారు. మంగళవారం ఉదయం చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకోగా.. సోమవారం ఉదయం నుంచి సీఐను ప్రశ్నించారు. అనంతరం వాహనంలో ఎక్కించుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. ఆధారాలు, బాధితురాలి ఇంటి వద్ద, ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించారు. మహిళను బెదిరించేందుకు ఉపయోగించిన సర్వీస్‌ రివాల్వర్‌ను ఫ్రీజ్‌ చేశారు. బాధితురాలి కుటుంబం, ప్రత్యక్ష సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details