అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనందసూర్య మండిపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకురావడం బ్రాహ్మణులకు ద్రోహం చేయడమేనన్నారు. జీవో 103ను రద్దు చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ‘బీసీలకు, బ్రాహ్మణులకు గొడవలు సృష్టించేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వైకాపా నేతలు ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. బ్రాహ్మణులకు తెదేపా అమలు చేసిన పథకాలన్నింటినీ నిలిపేశారు. ఇప్పుడు జీవో 103 ద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమశాఖ పరిధిలోకి తీసుకొస్తున్నారు’ అని మండిపడ్డారు.
శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి...
మరోవైపు రాష్ట్రంలో బ్రాహ్మణులకు అన్యాయం జరగబోదని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి చేర్చడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో బ్రాహ్మణ సమాజంలో కొంత గందరగోళం నెలకొందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇది పరిపాలన నిర్ణయం మాత్రమేనని వెల్లడించారు. దేవాదాయశాఖ నిధులను బ్రాహ్మణ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారనే విమర్శలు రావడంతో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి మార్చారని వివరించారు. బీసీల రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌పై రాజకీయంగా విమర్శలు తగవని సూచించారు. నవరత్నాల ద్వారా పేద బ్రాహ్మణులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నవరత్నాల్లో వర్తించని పథకాలను కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ..PDS RICE: ఏమారుతున్న రేషన్ బియ్యం..రీసైక్లింగ్ కొంత..విదేశాలకు మరికొంత