TIGER బలిష్ఠమైన దేహం.. పసిడివర్ణంలో మెరిసే పెద్దచారలు.. పదునైన పంజా.. ఎంతపెద్ద జంతువునైనా మట్టి కరిపించే బలం.. తీక్షణమైన చూపు.. భీతిగొలిపే ఆహార్యంతో ఆకట్టుకునే పెద్దపులిది వన్యమృగాల్లో ప్రత్యేక స్థానం. ఈ బెబ్బులికి ప్రస్తుతం శేషాచలం అడవులు నిలయంగా మారాయి. దాదాపు శతాబ్ద కాలం తరువాత శేషాచలాన్ని ఆవాస కేంద్రంగా మార్చుకుంది. అటవీ అధికారులు తాజాగా చేపట్టిన వన్యప్రాణి గణనలో భాగంగా పెద్దపులి ఆనవాళ్లను గుర్తించారు. నల్లమల అడవులను దాటుకుని వచ్చిన పెద్దపులికి తన భూభాగాన్ని ఏలడానికి శేషాచలం అడవులు సాదరంగా స్వాగతం పలికాయి.
నల్లమల నుంచి శేషాచలం వరకు..
నల్లమల అడవులు దేశంలోనే పెద్దపులులకు ప్రధాన ఆవాస కేంద్రం. ఈ అడవుల్లో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాజెక్టు(ఎన్‌ఎస్‌టీఆర్) నిర్వహిస్తున్నారు. ఈ అడవుల్లో గత నాలుగేళ్లలో పెద్దపులులు తమ సంతతిని గణనీయంగా పెంచుకున్నాయి. రాష్ట్రంలో 2018లో అటవీశాఖ నిర్వహించిన పులుల గణనలో 47 ఉన్నట్లు గుర్తించారు. 2022 గణనలో వాటి సంఖ్య 75కు పెరిగింది. అధునాతన కెమెరాలు, సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి అధికారులు నిర్ధారించారని అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో నిర్వహించిన అంతర్జాతీయ పులుల దినోత్సవంలో వెల్లడించారు. శేషాచలం అడవులతోపాటు పాపికొండ రిజర్వులోనూ ఇవి సంతతిని పెంచుకుంటున్నట్టు తద్వారా పులుల వృద్ధి 60 శాతం పెరిగినట్టు చెప్పారు. నల్లమల అడవుల నుంచి కడప మీదుగా శేషాచలం అడవుల్లోకి ఇవి ప్రవేశించినట్లు తెలిపారు.
శతాబ్దం తరువాత ప్రవేశం
బ్రిటిషు పాలనలో శేషాచలం అడవుల్లో పెద్దపులులు పెద్ద సంఖ్యలో సంచరించేవి. ఇందుకు ప్రఖ్యాత బ్రిటిష్ సంతతికి చెందిన భారతీయ రచయిత కెన్నెత్ అండర్సన్ రచనలు ఆధారంగా నిలుస్తున్నాయి. ఆయన వేటగాడు కావడంతో 1920లో సాగించిన దక్షిణ భారతదేశ యాత్రలో శేషాచలం అడవులు, వన్యప్రాణులు, వేట గురించి తన రచన ‘మ్యాన్ ఈటర్స్ అండ్ జంగిల్ కిల్లర్స్’ పుస్తకంలో పేర్కొన్నారు. అప్పట్లో రేణిగుంట మండలంలోని మామండూరు పరిధిలో పెద్దపులి మనుషులను చంపి తినిందని పెద్దఎత్తున ప్రచారం సాగింది. ఇది విన్న కెన్నెత్ అండర్సన్ మామండూరులోని అటవీ అతిథిగృహానికి చేరుకుని పులికోసం వెతికాడు. నాలుగు రోజుల అనంతరం అతనికి పెద్దపులి ఎదురుపడగా తుపాకీతో కాల్చి చంపి ఫొటో తీయించుకున్నాడు. ఆ చిత్రాన్ని తన పుస్తకంలో ముద్రించుకున్నాడు. అప్పటి నుంచి శేషాచలం అడవుల్లో పెద్దపులి ఆనవాళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మళ్లీ సరిగ్గా 102 సంవత్సరాల తరువాత తిరిగి శేషాచలం అడవుల్లోకి ప్రవేశించాయి.
102 ఏళ్ల తరువాత శేషాచలంలోకి బెబ్బులి ఆగమనం - ap news updates
వన్యమృగాల్లో ప్రత్యేక స్థానం ఉన్నది ఏదంటే వెంటనే గుర్తొచ్చేది పెద్దపులి. బలిష్ఠమైన దేహం, పసిడివర్ణంలో మెరిసే పెద్దచారలు, పదునైన పంజా, ఎంతపెద్ద జంతువునైనా మట్టి కరిపించే బలం ఉన్న ఈ బెబ్బులికి ప్రస్తుతం శేషాచలం అడవులు నిలయంగా మారాయి. దాదాపు శతాబ్ద కాలం తరువాత శేషాచలాన్ని ఆవాస కేంద్రంగా మార్చుకుంది. అటవీ అధికారులు తాజాగా చేపట్టిన వన్యప్రాణి గణనలో భాగంగా పెద్దపులి ఆనవాళ్లను గుర్తించారు.
TIGER