తెలంగాణ రాష్ట్రం కుమురం భీం జిల్లాలోని ప్రజలను పులి భయం వెంటాడుతూనే ఉంది. దహేగాం, బెజ్జూరు, పెంచికల్‌పేట్ మండలాల్లో పులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దాదాపు 110 గ్రామాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతాలు, పంటపొలాలకు వెళ్లేవారు పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒంటరిగా తిరగొద్దని... గుంపులుగుంపులుగా ఉండాలని ప్రజలకు ధైర్యం చెబుతున్నారు.
5 ప్రత్యేక బృందాలు..
పులి సంచారంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గ్రామాల్లో సర్పంచి నేతృత్వంలో స్థానిక బీట్ అధికారితో సహా 10 మంది బృందంగా ఏర్పడి పులిజాడ కోసం వెతుకుతున్నారు. అటవీ శాఖ నుంచి 5 ప్రత్యేక బృందాలు అడవుల్లో పులి కదలికలను పర్యవేక్షిస్తున్నాయి. కొండపల్లి అటవీ ప్రాంతంలో 3 ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు.