రాష్ట్రవ్యాప్తంగా నాడు- నేడు పథకం కింద ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల ఆధునీకరణ, నూతన కేంద్రాల నిర్మాణం కోసం నిధులు విడుదలకు ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. 989 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణతో పాటు 149 కొత్తవాటి నిర్మాణం కోసం 670 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ సోమవారం వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 13 జిల్లాల్లో 149 నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కోసం 256 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. 989 పీహెచ్సీల ఆధునీకరణ, సౌకర్యాలు మెరుగుపర్చేందుకు 413 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తున్న 47 ఏరియా ఆస్పత్రులు, 89 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయలు మెరుగుపర్చేందుకు 436 కోట్ల రూపాయలను ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నాబార్డులోని ఆర్ఐడీఎఫ్ నిధులను వెచ్చించనున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య ఉపకేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏపీఎమ్ఐడీసీ ద్వారా కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4,916 ఆరోగ్య ఉపకేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వాసుపత్రులకు రూ. 670 కోట్లు విడుదల - ఏపీలో ప్రభుత్వాసుపత్రులు
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చటంతో పాటు నూతన ఆస్పత్రుల నిర్మాణం కోసం ప్రభుత్వం భారీస్థాయిలో నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చటంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కోసం సోమవారం పాలనా అనుమతి ఇచ్చింది.
For the construction of hospitals, state Health Ministry releases Rs 670 crore