కృష్ణా జిల్లాలో ...
ఉండి నియోజకవర్గంలోని పాందువ్వలో ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ప్రతి ఆదివారం 850 కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. నేడు చింతలపాటి రాంబాబు సహకారంతో ప్రతి కుటుంబానికి బియ్యం, సరకులు అందజేశారు. కంభంపాడులో... జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గ నేత బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి కోడిగుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో గొడుగులతో సామాజిక దూరం పాటించారు.
నెల్లూరు జిల్లాలో..
ప్రజలకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో స్థానిక వైకాపా నేత కిషోర్ రెడ్డి రొయ్యలు పంపిణీ చేశారు. నెల్లూరులోని ధనలక్ష్మిపురంలో 700 కుటుంబాలకు రొయ్యలు, మాస్కులు, శానిటైజర్లు అందించారు. వెంకటగిరిలో పారిశుద్ధ్య కార్మికుల సేవలకు సంఘీభావంగా... వెంకటగిరి రాజావారి సేవాసమితి నిర్వాహకులు సామూహిక కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
ప్రత్తిపాడు జాతీయ రహదారిపై డ్రైవర్లు, బాటసారులకు ఓ యువకుడు ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. డ్రైవర్లు, బాటసారుల ఆకలి తీరుస్తున్న ఆ యువకుడిని పలువురు ప్రశంసించారు. దేవీపట్నం మండలం పెనికలపాడులో గిరిజనులకు స్థానిక ఎమ్మెల్యే ధనలక్ష్మి కూరగాయలు పంపిణీ చేశారు. రాజానగరంలో జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ కూరగాయలు అందజేశారు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
విశాఖపట్నం జిల్లాలో ...
అనంతగిరి మండలంలోని పేదలకు యునిటైడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్లో పేదల ఇబ్బందులు గమనించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి కోడిగుడ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేత రమణి ప్రోత్సాహంతో 600 కుటుంబాలకు కోడిగుడ్లు అందజేశారు.