ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: యూకే ప్రయాణికుల సన్నిహితులపై దృష్టి

యూకే నుంచి వస్తున్న ప్రయాణికులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ మార్గాల్లో వస్తుండటం వల్ల వారిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే వారి బంధువులు, స్నేహితులు, వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నిస్తోంది.

యూకే ప్రయాణికుల సన్నిహితులపై దృష్టి
యూకే ప్రయాణికుల సన్నిహితులపై దృష్టి

By

Published : Dec 31, 2020, 11:02 PM IST

ఒక ప్రయాణికుడు ఈ నెల 14న యూకే నుంచి చెన్నైకి, అక్కడ్నించి విమానంలో హైదరాబాద్‌కు వచ్చాడు. ఇక్కడ భార్యాపిల్లలతో కలిసి సుల్తాన్‌బజార్‌ సహా పలు ప్రాంతాల్లో షాపింగ్‌ చేశాడు. సోదరి నిశ్చితార్థ సంబరాల్లో పాల్గొన్నాడు. తండ్రి షష్టి పూర్తి వేడుకలనూ ఘనంగా నిర్వహించాడు. అనంతరం బెంగళూరుకు వెళ్లి అక్కడా షాపింగ్‌ చేశాడు. ఇటీవల యూకే వైరస్‌ కలకలం నేపథ్యంలో.. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమై ఆ ప్రయాణికుడిని వెతికి పట్టుకొని కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ వ్యక్తిలో యూకే వైరస్‌ ఉత్పరివర్తనాలున్నాయా? అనేది కనుగొనడానికి నమూనాలను సీసీఎంబీకి పంపించారు. ఒకవైపు ఫలితాల కోసం వేచిచూస్తూనే.. ఆయన కలసిన వారిలో ఇప్పటి వరకూ 84 మందిని గుర్తించి, అందరిలోనూ నమూనాలను సేకరించి కొవిడ్‌ పరీక్షకు పంపించారు. రాష్ట్రానికి ఈ నెల 9 నుంచి 1,216 మంది యూకే ప్రయాణికులు వచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. ఇందులో ఇప్పటికే 996 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 966 మందికి కరోనా నెగిటివ్‌గా వెల్లడవగా.. 21 మందిలో మాత్రం పాజిటివ్‌గా తేలింది. కొవిడ్‌ నిర్ధారణ అయిన వారి నమూనాలను సీసీఎంబీకి పంపించగా.. ఇప్పటికే ఇరువురిలో యూకే వైరస్‌ ఉన్నట్లుగా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది.

ఎంతమందికి వ్యాప్తి అనేది ప్రశ్నార్థకం
తెలంగాణకు యూకే నుంచి వచ్చిన వారిలో అందరూ నేరుగా హైదరాబాద్‌కు చేరుకోలేదు. వేర్వేరు మార్గాల్లో తెలంగాణకు వచ్చినవారు దాదాపు 200 మందికి పైగానే ఉన్నారు. వారిలో యూకే వైరస్‌ ఉంటే.. ఈ క్రమంలో సహ ప్రయాణికుల్లో ఎంతమందికి వ్యాప్తి చేసి ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే దాదాపు 70 శాతానికి పైగా యూకే ప్రయాణికులు ఉండడంతో.. ఇక్కడ అందుబాటులో ఉన్న కొద్దిపాటి సిబ్బంది ఉరుకులు పరుగుల మీద పనిచేయాల్సి వస్తోంది.

అలర్జీలుంటే కొవిడ్‌ టీకా ఇవ్వరు
వచ్చే 2 వారాల్లో కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయనే సమాచారంతో తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు.. అవి నయమయ్యే వరకూ టీకా ఇవ్వకపోవడమే మేలని సూచించింది. ఏ కారణంతోనైనా జ్వరంతో లేదా ఏదైనా అలర్జీతో బాధపడుతున్న వ్యక్తులకు టీకా ఇవ్వద్దని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:జనవరి 1న డీసీజీఐ బృందం భేటీ- టీకా డేటా విశ్లేషణ

ABOUT THE AUTHOR

...view details