Flow of money in munugode by elections: ఉప ఎన్నిక పోలింగ్‌కు ఇంకా పక్షం రోజుల సమయం ఉండగానే మునుగోడు నియోజకవర్గ పరిధిలో డబ్బు ప్రవాహం మొదలైంది. క్షేత్రస్థాయిలో కీలకంగా ఉన్న నాయకుల కొనుగోళ్లకు ఇప్పటివరకు రూ.లక్షల్లో వెచ్చించిన ప్రధాన పార్టీలు ఇప్పుడు నేరుగా ఓటర్లకే పైసలు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా వివిధ మార్గాల ద్వారా నియోజకవర్గంలోని పలు గ్రామాలకు తరలిస్తున్నాయి. ఇలా తరలిస్తున్న భాజపా నేతకు చెందిన రూ.కోటిని పోలీసులు తాజాగా పట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి మునుగోడుకు వచ్చే వివిధ ప్రాంతాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా కొందరు డొంకలు, ఆటోలు, బైక్‌లు ద్వారా డబ్బులు నియోజకవర్గంలోని పలుప్రాంతాలకు చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిఘాపెంచడంతోపాటు అన్నిపార్టీల ముఖ్యనేతల వాహనాల కదిలికలపై దృష్టి సారించారు. పోలీసులు, ప్రత్యర్థిపార్టీ నేతలు కనిపెట్టకుండా వ్యూహాత్మకంగా డబ్బుల పంపిణీ అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు తక్కువ మొత్తంలో డబ్బుఇచ్చి, మధ్యాహ్న భోజనంతోపాటూ మద్యం పంపిణీ చేసేవారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రతిగ్రామంలో ఓటర్కు ఎదుటి పార్టీ కంటే ముందే డబ్బులు ఇవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులోభాగంగా కోట్ల రూపాయలను నియోజకవర్గానికి తరలివస్తున్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.
డబ్బులు దాచి వేత.. ఏళ్లుగా పార్టీ నియమావళికి బద్ధుడై, విధేయుడైన పెద్దగా జనంలో ప్రచారంలేని నాయకుల ఇళ్లలో ప్రధానపార్టీలు డబ్బులు దాస్తున్నట్లు తెలిసింది. ఇటీవల నామినేషన్సందర్భంగా నాయకులు, కార్యకర్తల ఖర్చుల అవసరాలకు సంబంధించి ఓ ప్రధాన పార్టీ చండూరు పురపాలిక సమీపంలోని ఓ గ్రామంలో పార్టీకి చెందిన ఓ నిరుపేద వద్ద 25 లక్షలు ఉంచినట్లు తెలిసింది. ఆ విషయం సదరువ్యక్తి భార్యకు తెలియకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. ఎంతమొత్తం అనేది అతనికి చెప్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరోపార్టీ సైతం ఆ పార్టీకి ఏళ్లుగా విధేయులుగా ఓ మహిళా కార్యకర్త వద్ద 36 లక్షలు ఉంచి, నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఎవరికి ఎంతఇవ్వాలో ఓ చీటీ రాసి ఇచ్చినట్లు తెలిసింది. ఎవరికి అనుమానంరాని కార్యకర్తలు, నాయకుల వద్ద ఓ ప్రధాన పార్టీ 10 లక్షలు తక్కువకాకుండా ఇప్పటికే పదుల సంఖ్యలో డబ్బులు డంప్ చేసినట్లు సమాచారం. గ్రామాలకు ఇన్‌ఛార్జులు ఉన్న వారు తాజాగా వివిధ ఖర్చులన్నీ భరిస్తుండగా బయటినుంచి డబ్బులు వారికి అందుతున్నాయి. ఓ ప్రధానపార్టీకి చెందిన సుమారు 4.5 కోట్లను నియోజకవర్గంలోని పలుమండలాల్లో ఇప్పటి వరకు పోలీసులు సీజ్చేసినట్లు తెలిసింది. ముఖ్య నేతలు, కార్యకర్తలపై పోలీసులతోపాటు ఎన్నికల పరిశీలకుల నిఘాఉండటంతో ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటుచేసి నగదు తరలిస్తున్నట్లు సమాచారం.