తీవ్ర వాయుగుండం తెచ్చిన ఉపద్రవం నుంచి రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు సహా రాష్ట్రంలోని ఏడు జిల్లాలు వరదలతో అల్లాడుతూనే ఉన్నాయి. పంటలు మునిగి రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఆవాసాలు కోల్పోయిన నిరుపేదల కష్టాలు వర్ణనాతీతం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏలేరు జలాశయం దిగువ ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న కాలువలకు 34 చోట్ల గండ్లు పడ్డాయి.
దీంతో కిర్లంపూడి, జగ్గంపేట, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, కాకినాడ నగరం, గ్రామీణ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత నెలలో ఇదే జలాశయం దిగువన వరద ఉద్ధృతికి 27 చోట్ల గండ్లు పడ్డాయి. జిల్లాలో 39,346 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 3,150 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా. 216 జాతీయ రహదారిపై వరదతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి.
రైతు కుదేలు
* 11 జిల్లాల్లో 2.21 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా లక్ష ఎకరాల వరి నీట మునిగింది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ నష్టం ఎక్కువగా ఉంది. కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాలతోపాటు పలుచోట్ల 33వేల ఎకరాల పత్తి దెబ్బతింది. ఉద్యానశాఖ పరిధిలో రూ.50 కోట్ల వరకు విలువ చేసే 25వేల ఎకరాలకుపైగా పంట నష్టపోయినట్లు అంచనా.
* ఆక్వా రంగంలో 7,437 ఎకరాల్లో చెరువులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
* విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో వలలు, పడవలు కొట్టుకుపోయి రూ.1.17 కోట్ల నష్టం వాటిల్లింది.
పశ్చిమలో భారీ నష్టం
పశ్చిమగోదావరి జిల్లాలో తమ్మిలేరు నీటిమట్టం 25వేల క్యూసెక్కుల నుంచి పది వేల క్యూసెక్కులకు తగ్గడంతో ఏలూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. యనమదుర్రు డ్రెయిన్ ఉద్ధృతికి తణుకు మండలం దువ్వ గ్రామం నీట మునిగింది. పెనుమంట్ర మండలం ఎస్.ఇల్లిందుపర్రు గ్రామంలోకి గోస్తనీ వరద చేరింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలోకి వరద ప్రవేశించింది. కామాక్షి ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. జిల్లావ్యాప్తంగా 281 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడేపల్లిగూడెం సమీపంలోని ఎర్రకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నందమూరు, మారంపల్లి గ్రామాల్లో వరద తాకిడి ఎక్కువైంది. ఈ 2 గ్రామాల్లోని 209 కుటుంబాలకు చెందిన 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వీరంపాలెంలో ఎర్రకాలువకు గండి పడి శివాలయం మునిగింది. నిడదవోలు మండలం తాళ్లపాలేనికి రాకపోకలు నిలిచాయి. ఎర్రకాలువ పరివాహక ప్రాంత గ్రామాల్లో 3వేల ఎకరాల వరి నీట మునిగింది. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోట సత్తెమ్మ తల్లి దేవస్థానంలో మూలవిరాట్టును వరద తాకింది.