Floods: గోదావరి వరద జనాన్ని కోలుకోనివ్వట్లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా వర రామచంద్రపురం పరిధిలోని పునరావాస కేంద్రంలో.. వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ప్రవాహం ప్రమాదకరంగా మారడం వల్ల.. ఆమె రేఖపల్లి పునరావాస కేంద్రంలో తలదాచుకుంది. ఈ క్రమంలో.. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక భద్రాచలం సమీపంలోని ఎటపాక, నూర్మూరు, నందిగామ, గౌరీదేవిపేట, గన్నవరం, గన్నేరుకొయ్యపాడు, తోటపల్లి, విరాయిగూడెం, నెల్లిపాకతో పాటు 20 గ్రామాలు ముంపులో ఉన్నాయి. చాలామంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
కోనసీమ లంక గ్రామాల్నీ వరద చుట్టిముట్టింది. 4 రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినవిల్లి పరిధిలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు.. అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి సైతం అయినవిల్లి పరిధిలోని వీరవల్లిపాలెం, అయినవిల్లిలంక, కొండుకుదురులంక, పొట్టిలంక, గుణ్ణంవారిమెరకలో పర్యటించారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అయితే.. కొన్నిచోట్ల జనం తమ గ్రామం విడిచిరాలేమని అధికారులకు తెలిపారు. తమకు వరద అలవాటేనంటున్నారు.