FLOODS EFFECT IN AP : వరదల పేరు వింటేనే రాష్ట్ర ప్రజలంతా వణికిపోతున్నారు. గత పదిహేను రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడి చికిత్స అందక నరకయాతన అనుభవిస్తున్నారు. తినేందుకు తిండి, తాగేందుకు నీరు, కట్టుకునేందుకు బట్ట లేక కన్నీరుమున్నీరవుతున్నారు. భారీ వరదల నుంచి పలువురు ప్రాణాలు కాపాడుకున్నప్పటికీ.. తమ జీవనాధారాన్నే కోల్పోయారు. వాటి నుంచి కాస్త కూడా తేరుకోకముందే.. మళ్లీ రాష్ట్రంలో భారీ వర్ష సూచన అన్న వార్తతో జనాలు గడగడా వణికిపోతున్నారు. ఏం చేయాలో పాలుపోక.. ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
44 మంది మృతి
44 PEOPLE LOST LIVES IN HEAVY RAINS IN RAIN: రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. చూస్తుండగానే.. నదులు, జలాశయాలు, చెరువుల కట్టలు తెగిపోయాయి. అధికారుల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసేలోపు వరదలు గ్రామాల్లోకి చేరి ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా దాదాపు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చాలామంది మృతదేహాలు ఇప్పటికీ లభ్యంకాలేదు. తమ కళ్ల ముందే కుటుంబ సభ్యులు, తెలిసిన వాళ్లు కొట్టుకుపోవడం చూసి ప్రజలు.. కన్నీరుమున్నీరవుతున్నారు. కడప జిల్లాలో ఓ వ్యక్తి తమ కుటుంబంలోని ఏడుగురిని కాపాడి వరదలో కొట్టుకుపోయాడు. ఇలా గల్లంతైన ఎంతో మంది ఆచూకీ లభ్యం కాలేదు. తమ వాళ్లు ప్రాణాలతో బయటపడితే బాగుండని కోరుకుంటూనే.. ఒకవేళ చనిపోతే శవాలైన దొరకాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు బాధితులు.
ఇళ్లూ, జీవనాధారం కోల్పోయిన వేల కుటుంబాలు
కనీవినీ ఎరగని స్థాయిలో విరుచుకుపడిన వరదల (HEAVY RAINS IN AP) ధాటికి.. చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 13 వందలకు పైగా గ్రామాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కళ్లముందే ఎత్తైన భవంతులు నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు మిగిలినప్పటికీ.. ఇళ్లలో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. బంగారం, డబ్బులే కాదు గ్యాస్ సిలిండర్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు సహా అన్నీ కొట్టుకుపోయాయి. ఆవులు, గేదెలు, మేకలు వందల సంఖ్యలో నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటికీ చాలా గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వర్షాల కారణంగా పునరావాస కేంద్రాలకు వెళ్లిన చాలా మంది ఇంకా తమ ఇళ్లకు తిరిగిరాలేదు. వచ్చినా.. వారి ఇళ్లు ఎక్కడున్నాయో కూడా గుర్తుపట్టలేని విధంగా పరిస్థితులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
కోతకు గురైన రోడ్లు.. ఎక్కడికీ వెళ్లలేక జనాలు ఇక్కట్లు..(ROADS FULLY DAMAGED IN AP)
వరద ధాటికి వంతెనలు కుప్పకూలాయి.. రోడ్లు కొట్టుకుపోయాయి.. రైలు పట్టాలు నీటిపై తేలియాడాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చెన్నై-కోల్‌కతా మార్గంలో నెల్లూరు దాటాక దామరమడుగు వద్ద 16వ నంబరు జాతీయ రహదారి ఓ వైపు కొట్టుకుపోయింది. నెల్లూరు జిల్లా పడుగుపాడు సమీపంలో ట్రాక్ మీదకు నీరు రావడంతో పలు రైళ్లను నిలిపేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలో రాయల చెరువుకు లీకేజీ ఏర్పడి వంద గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. తిరుపతి నగరం వరద నుంచి ఇంకా కోలుకోలేదు. కడప జిల్లాలోని పాపాగ్ని నదిపై వంతెన కుప్పకూలింది.
ఇసుక దిబ్బల్లా మారిన పంట భూములు..!
నదుల పక్కనున్న జలాశయాల కట్టలు తెగిపోయి.. వరద నీరంతా నదీ పరివాహక ప్రాంతాలను ముంచేసింది. కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం మట్టికట్ట తెగి.. పచ్చని పంటపొలాల్ని, తోటల్ని మొత్తం ఇసుక దిబ్బలుగా మార్చేసింది. వరద ప్రభావిత గ్రామాల్లోని పంట పొలాల్లో నాలుగు అడుగుల ఎత్తున ఇసుక పేరుకుపోయింది. చాలా గ్రామాల్లో వందల ఎకరాల్లోకి ఇసుక దిబ్బలు వచ్చేశాయి. ఏటా రెండు, మూడు పంటలు సాగు చేసే రైతులు... కనీసం తమ పంట పొలాలను తిరిగి సాగులోకి తేగలమా? అందుకు ఎన్నేళ్లు పడుతుంది? అప్పటివరకూ బతికెదేలా? అంటూ ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ భూమి కోతకు గురై సాగుకు పనికిరాకుండా పోయింది.
వేల ఎకరాల్లో పంట నష్టం..
PADDY LOSS ON FLOOD AFFECTED AREAS IN AP: భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రధాన పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. కృష్ణా, గోదావరి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లడం వల్ల లక్షల ఎకరాల పంట.. నీటమునిగింది. పత్తి, మిరప, వరి, వేరు శనగ, అరటి, తమలాపాకు సహా ఇతర పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న ధాన్యం.. వర్షార్పణమైంది. కొన్నిచోట్ల ధాన్యం పూర్తిగా నానిపోయి మొలకలు వచ్చాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో 2.86 లక్షల హెక్టార్లలోని పంట నష్టపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది. ఈ నష్టం ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.