పోలవరం పనుల్లో జాప్యానికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పోలవరం దిగువ కాఫర్ డ్యాంను వరద ముంచెత్తింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. దీంతో ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం మొత్తం వరద నీటితో ఏకమైపోయింది. గోదావరిలో వరద పూర్తిగా తగ్గే వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టడానికి సాధ్యమయ్యే అవకాశం లేదు. ప్రస్తుతానికి పోలవరం పనులు పూర్తిగా అటకెక్కినట్లే.
గోదావరికి వరదలు వచ్చే సమయానికి దిగువ కాఫర్ డ్యాం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. అనుకున్నంత వేగంగా పనులు చేపట్టకపోవడంతో పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. దిగువ కాఫర్‌డ్యాం 30.5 మీటర్ల ఎత్తుకు నిర్మించకపోవడంతో.. స్పిల్‌వే మీదుగా దిగువక చేరిన నీరంతా మళ్లీ వెనక్కి ఎగదన్ని ఎగువ కాఫర్‌డ్యాం ప్రాంతానికి చేరింది. దీంతో ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతమంతా నీట మునిగి పోలవరం పనులు నిలిచిపోయాయి. దిగువ కాఫర్ డ్యాం సకాలంలో నిర్మించి ఉంటే వరద వచ్చినా పనులు చేసుకునే అవకాశం ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది వరద కారణంగా ఇసుక కోతకు గురైన ప్రాంతంలో పనులు పూర్తికాకపోవడంతో.. ప్రధాన డ్యాం ఆకృతులు ఇప్పటికీ ఖరారు కాలేదు.
గతేడాది వరదలకు ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతంలోని డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. దీని సామర్థ్యం తేల్చేందుకు ఎన్‌హెచ్‌పీసీ నిపుణులు ఓ కొత్త విధానాన్ని సిద్ధం చేసి జలవనరులశాఖ అధికారులకు అప్పగించారు. అయితే దీన్ని పరీక్షించి ఫలితాలు రాబట్టేందుకు కనీసం నెలరోజుల సమయంపట్టనుంది. అలాగే దిగువ కాఫర్‌డ్యాం సైతం గత వరదలకు కొంతమేర కొట్టుకుపోయి జెట్ గ్రౌటింగ్ ధ్వంసమైంది. ఇప్పుడు మరోసారి దిగువ కాఫర్ డ్యాం మీద నుంచి నీటి ప్రవాహం సాగుతోంది. దీంతో మళ్లీ అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే వరద పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ఆది,సోమవారాల్లో దిగువ కాఫర్‌డ్యాం 24 మీటర్ల ఎత్తుకు పెంచాలని హడావుడి చేశారు. ఇన్నాళ్లుగా చోద్యం చూస్తూ.. ఒక్క రోజులోనే అంత పని పూర్తి చేయాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆదివారం రాత్రికే వరద ముంచెత్తడంతో ఆ పనీ విరమించుకున్నారు.
ఎగువ, దిగువ కాఫర్ డ్యాం మధ్య భాగం మొత్తం వరద నీరు చేరడంతో గుత్తేదారులు యంత్రాలను తీసుకుని ఒడ్డుకు చేరుకున్నారు.