జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పెద్దంపేట వాగుకు భారీగా వరద రావడంతో కరెంటు స్తంభాలు, లైన్లు నేలకూలాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
ఇదే జిల్లాలోని పలిమెల మండలం 10 రోజులుగా అంధకారంలో మగ్గుతోంది. 13 గ్రామాలకు కరెంటు లేకుండా పోయింది. దోమలతో సహవాసం చేస్తున్నామని ఆ గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విద్యుత్తు లేక మోటార్లు పనిచేయలేదు. పైపులు వరదలో కొట్టుకుపోవడంతో భగీరథ నీళ్లు రాక తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలని బాధితులు అధికారులను వేడుకున్నారు.
భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చింతిర్యాల, ఆనందాపురం, నెల్లిపాక, రామచంద్రాపురం, అమీర్థ, అమ్మగారిపల్లి, బట్టీలగుంపు తదితర గ్రామాల్లో చీకటి రాజ్యమేలుతోంది.
Flood Effect on Villages in Telangana : అధిక వర్షాలు, వరదలతో కరెంటు సరఫరా లేక వరదపీడిత ప్రాంతాల్లో వేల మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. గోదావరి వరదలతో 243 గ్రామాల్లో, ఇతర ప్రాంతాల్లో గాలులు, వర్షాలతో సరఫరా నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు నేలకొరగడంతో వాటిని తిరిగి నిలబెట్టి సరఫరాను పునరుద్ధరించడానికి విద్యుత్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. వరదల వల్ల ఇప్పటివరకూ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు చెందిన రూ.30 కోట్లకు పైగా విలువైన సామగ్రి దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా. దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో వరదలు పెద్దగా లేనందున నష్టాలు ఎక్కువగా లేవని డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి చెప్పారు.
ఉత్తర తెలంగాణలో అపారనష్టం..గోదావరి వరదలతో పాటు, కుంభవృష్టి వర్షాల వల్ల ఉత్తర తెలంగాణ డిస్కంకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలాచోట్ల స్తంభాలు విరిగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు నీటమునగడంతో వాటిని మార్చాల్సిన అవసరమేర్పడింది. భద్రాద్రి జిల్లాలో నష్టం అధికంగా ఉండటంతో ప్రత్యేకంగా ఒక సంచాలకుడి(డైరెక్టర్)ని భద్రాచలంలో నియమించి మరమ్మతు పనులను పర్యవేక్షించాలని ఉత్తర డిస్కం ఆదేశించింది. ఇంకా ఒక్క భద్రాద్రి జిల్లాలోనే 17 గ్రామాలకు కరెంటు సరఫరా పునరుద్ధరించాల్సి ఉందని సంచాలకుడు వెంకటేశ్వరరావు చెప్పారు.
Flood Effect on Villages in Bhupalpally : కొన్ని ప్రాంతాల్లో వరదలు విద్యుత్ లైన్లను సైతం ముంచేసి ప్రవహించడంతో వరదనీటిలో కొట్టుకువచ్చిన కలప, ఇతర చెత్తా తీగలపై చుట్టుకుపోయింది. వాటిని తొలగించకుండా కరెంటు ఇస్తే ప్రమాదమని ఆపేశారు. నీటిలో మునిగి ఉన్న సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు పడవల్లో వెళ్లి నష్టాలు అంచనా వేసి మరమ్మతులు చేస్తున్నారు. వాజేడులో మునిగిన ఒక ట్రాన్స్ఫార్మర్ వద్దకు పడవలో వెళ్లి మరమ్మతు చేశారు. పొలాల ముంపు కారణంగా వ్యవసాయ బోర్లకు కరెంటును రైతులు ఇప్పటికిప్పుడు అడగటం లేదు. దీంతో గృహాలకు సరఫరా పునరుద్ధరణపై దృష్టి పెట్టినట్లు ఉత్తర డిస్కం సీఎండీ అన్నమనేని గోపాలరావు చెప్పారు.