విజయవాడ, గుంటూరు పరిధిలోని పేదలకు అమరావతి రాజధాని భూములను ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయాలనే నిర్ణయంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం అడుగులు ముందుకే పడుతున్నాయి. ఐనవోలు, మందడం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఉద్రిక్తత మధ్య భూమి చదునుకు శ్రీకారం చుట్టారు. వాహనాలను అడ్డుగాపెట్టి వందలాది పోలీసుల పహారాలో కార్యక్రమం చేపట్టారు. రైతులు వాగ్వాదానికి దిగడంతో.... సీఆర్డీఏ కమిషనర్ అనుమతితోనే తాము స్థలాలు చదును చేస్తున్నామంటూ అధికారులు తమ పని కానిచ్చేశారు. ఏయే సర్వే నెంబర్లలో చదును చేస్తున్నారో తమకు చెప్పాలని రైతులు కోరగా అధికారులు అవేమీ పట్టించుకోలేదు. తమను అడ్డుకుంటే అరెస్టు చేయిస్తామని హెచ్చరించిన్లట్లు రైతులు వాపోయారు.
పోలీసుల పహారా నడుమ రాజధాని భూముల చదును
అమరావతి రైతుల నిరసన మధ్యే రాజధానికిచ్చిన భూముల్లో పేదల ఇళ్ల స్థలాల కోసం ఫ్లాట్లను సిద్ధం చేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ మందడం, ఐనవోలు, ఎర్రబాలెం గ్రామాల్లో స్థలాలు చదును చేశారు. కోర్టులో విచారణ జరుగుతుండగా ఎలా చదును చేస్తారని రైతులు వారిని ప్రశ్నించారు. తమకు భూములు ఎక్కువై రాజధానికి ఇవ్వలేదని ఆక్రోశం వెళ్లగక్కారు.
capital lands issue
మంగళగిరి మండలం ఎర్రబాలెంలోనూ రైతులిచ్చిన 164 ఎకరాలను పేదలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో పెరిగిన చెట్లను అధికారులు తొలగించారు. సుమారు 500మంది పోలీసుల పహారాలో తమ పనికానిచ్చేశారు. పండగ వాతావరణంలో భూములు తీసుకున్న సీఆర్డీఏ ఇప్పుడు దొంగచాటుగా ఎందుకు చదును చేస్తోందని రైతులు ప్రశ్నించారు. రాజధానికిచ్చిన భూములును పేదలకు పంచాలనే నిర్ణయంపై హైకోర్టులో ఈనెల 12న విచారణ జరగనుండగా ప్రభుత్వం నిరంకుశంగా ముందుకెళ్లడం సరికాదని రైతులు ఆక్షేపించారు.