తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో విషాద ఘటన జరిగింది. శనివారం అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మృతి చెందాడు. ఆయన భార్య మణెమ్మ (68) గ్రామంలో నివసిస్తుండగా, ఆమె కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కోసం తమ కుటుంబాలతో గ్రామానికి వచ్చారు. శనివారం ఆ కార్యక్రమం ముగియగా రాత్రి భోజనాల అనంతరం 9 మంది ఓ గదిలో పడుకున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నానిపోయి ఉన్న మట్టి మిద్దె... అర్ధరాత్రి కూలడంతో అందులో పడుకున్న మణెమ్మతోపాటు ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ (40), ఉమాదేవి (35), మనవరాళ్లు వైష్ణవి (14), అక్షయ (12) అక్కడిక్కడే మృతి చెందారు. మూడో కుమారుడు కుమారస్వామి తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కుమారస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన భార్య సుప్రజ, కుమార్తెలు వైష్ణవి, అక్షయ ఈ ప్రమాదంలో మృతి చెందారు. సంఘటన జరిగిన వెంటనే కుటుంబసభ్యులు 100కి సమాచారమివ్వగా సీఐ సూర్యానాయక్, ఎస్సై రామన్‌గౌడ్ సిబ్బందితో తరలివచ్చి సహాయక చర్యలు చేపట్టారు. నాగర్‌కర్నూల్ ఎస్పీ సాయిశేఖర్, వనపర్తి ఏఎస్పీ షాకీర్ హుసేన్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను వనపర్తి ఆస్పత్రికి తరలించారు.